🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. వసిష్ఠమహర్షి-అరుంధతి - 1 🌻
బోధనలు/గ్రంధాలు: వసిష్ఠస్మృతి, వసిష్ఠ ధర్మ సూత్రములు, వృద్ధవాసిష్ఠము, మితాక్షర, స్మృతిచంద్రిక, యోగవాసిష్ఠము, జ్ఞానవాసిష్ఠము, జ్యోతిర్వాసిష్ఠము
జ్ఞానం:
1. వసిస్ఠమహర్షి సత్వగుణంలో అగ్రగణ్యుడు. లోకంలో అందరికంటే అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని పొందినవాడాయన. బ్రహ్మదేవుడికి కూడా ఆగ్రహం ఉంది, రజోగుణం ఉంది. కాని ఈయనలో లేవు. అంటే వసిష్ఠుడు ఆ గుణంలో బ్రహ్మదేవుడికంటె అధికుడు. అంతటి మహాత్ముడు ఆయన.
2. ఈయనది ఒక జన్మ కాదు. శరీరం పోగొట్టుకుని, బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మళ్ళీ శరీరరం తెచ్చుకున్నవాడు. కాబట్టి ఆయన విషయంలో మొదటి జన్మ, రెండవ జన్మ అని చెప్పవలసి వస్తుంది. ఆయన వ్యక్తి రూపంలో అలాగేఉన్నారు. అదే చిత్తము, అదే వ్యక్తి. శరీరంపోతే, మరొకశరీరం తెచ్చుకున్నారంతే. బ్రహ్మముఖం నుంచి బహిర్గతం అయిన నవబ్రహ్మలలో ఒకరు ఈయన. ఈయన సప్తర్షులలో కూడా ఒకరు. ఇక్ష్వాకువంశానికి కులగురువు.
3. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క సమూహం సప్తర్షులుగా ఉంటారు. ఈ వసిష్ఠమహర్షి యొక్క సంతానం ఏడుగురూకూడా ‘ఉత్తమ’ మన్వంతరంలో(ఉత్తముడనే మనువునుండి ప్రవర్తిల్లిన మన్వంతరమని అర్థం) సప్తర్షులైనారట.
4. ఒకసారి నిమి చక్రవర్తి తమ కులగురువైనటువంటి వసిష్ఠునిపట్ల అవిధేయత చూపించాడని వసిష్ఠుడు ఆగ్రహించి “కులగురువైన నన్ను తిరస్కరించావు కనుక నీవు విదేహుడివి కావలసింది” అని శాపం ఇచ్చడూ. అంటే దేహాన్ని కోల్పొమ్మని.యజ్ఞానికి దేహం ప్రధానం. శరీరంపోయిన తరువాతకూడా, ఆ జీవాత్మయందు అంతకుముందు సుప్రతిష్ఠితమైనటువంటి బ్రహ్మోపాసన వంటి యోగక్రియ స్థిరంగా ఉండి ఉంటే, దేహం లేకుండాకూడా యజ్ఞం చేయవచ్చు. దేహంతో నిమిత్తమేలేని తపస్సులుకూడా ఉన్నాయి.
5. అటువంటి తపోమార్గంలో ఉండేవాళ్ళు అనేకులు ఉన్నారు. తపోలోకం అంటే అదే అర్థం. అయితే యజ్ణంచేసేవాడి దేహంలో లోపములు ఉండకూడదు. వేలువంకర, పక్షపాతం వంటి ఏ దోషాలు పనికిరావు. అంగవైకల్యం ఉండకూడదు. ఆరోగ్యానికి భంగం ఉండకూడదు.సర్వేంద్రియాలు సక్రమంగా ఉండాలి.
6. యజ్ఞం చేసేవాడికి, హోతకు, ఉద్గాతకు – వీళ్ళందరికీకూడా అవయవపుష్టి, ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి. మెల్లకన్ను కూడా ఉండకూడదు. అట్లాంటి లోపాలున్నవాడు ఎంత పండితుడైనా పూర్వం యజ్ఞంలో తిరస్కరించేవారు. అట్లాంటి వాళ్ళతో ఏదో ఒక సేవ చేయించుకునే వాళ్ళేకాని హోత, ఉద్గాత వంటి ముఖ్యమైన యజ్ఞ స్థానాలకు వారు అనర్హులనే నిర్ణయించబడింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
20 Dec 2020
No comments:
Post a Comment