✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 10
🍀. 8. తామరాకు - నీటి బిందువు - బ్రహ్మమునకు సమర్పితముగ, సంగము విడచి కర్మల నెవరైతే నాచరింతురో, అట్టివారిని పాప మంటదు. నీటి బొట్లు ఎన్ని పడినను, తామరాకు నంటవు కదా! కర్మము లన్నియు వచ్చి పోవునవే. తానాధారముగ అనేకానేక కర్మలు వచ్చి, నిర్వర్తింపబడి పోవుచునుండును. కర్మల ననుసరించి బుద్ధి పోరాదు. బుద్ధి ననుసరించి మనస్సుండ వలెను. కర్మలు నిర్వర్తింప బడుచున్నను, బుద్ధిని దైవముపై నిలపిన, కర్మలు జరిగి పోవుట, తాను దైవముతో నుండుట జరుగును. ఆ బంధము పటిష్ఠమైనచో నిర్వర్తించు కర్మలయందు ఫలాసక్తి యుండదు. దైవమునం దాసక్తి చెందిన బుద్ధి, ఫలముల యందాసక్తి కలిగి యుండదు. అట్టి వానిని కర్మ లంటవు. 🍀
10. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్యా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్ర వివాంభసా || 10
బ్రహ్మమునకు సమర్పితముగ, సంగము విడచి కర్మల నెవరైతే నాచరింతురో, అట్టివారిని పాప మంటదు. నీటి బొట్లు ఎన్ని పడినను, తామరాకు నంటవు కదా! ఉషా సమయమున మంచుబిందువులు తామరాకుల పై పడుట, ఆ బిందువులు సూర్యరశ్మికి ముత్యములవలె ప్రకాశించుట చూచి మనస్సంతయు ఆహ్లాదము చెందును.
అట్లే బ్రహ్మమునకు సమర్పితము చేసిన మనసుతో కర్మ లాచరించు వారు, వాని ఫలముల యందు ఆసక్తి లేకుండుటచే చేయు పనులు ఆహ్లాదము కలిగించుచు నుండును. ఆసక్తి ఫలముల యందు కలిగినచో ఆహ్లాదము లేకపోగా మనసు ప్రపంచమున కంటును.
నీటి బిందువు తామరాకుపై నున్నను, తామరాకునకు దానిపై ఆసక్తి లేదు. అట్లే కర్మలను మనసు ద్వారా ఆచరించు వాడు ఫలములయం దాసక్తి లేక ఆచరించినచో అతనిని ఆ కర్మలు బంధించవు. అంటను కూడ నంటవు. నీటి బిందువులు ప్రతి నిత్యము తామరాకుపై రాలుచు నుండును. ఆకునుండి జాలు వారుచు పోవుచునుండును.
ఈ విషయమున తామరాకు సాక్షీ
భూతముగ నుండునే గాని రాలిపోవుచున్న బిందువులను గూర్చి బాధపడదు. కర్మము లన్నియు వచ్చి పోవునవే. తానాధారముగ అనేకానేక కర్మలు వచ్చి, నిర్వర్తింపబడి పోవుచునుండును.
తామరాకు నీటి బిందువుల ననుసరించనట్లే, కర్మల ననుసరించి బుద్ధి పోరాదు. బుద్ధి ననుసరించి మనస్సుండవలెను. కర్మలు నిర్వర్తింపబడుచున్నను, బుద్ధిని దైవముపై నిలపిన, కర్మలు జరిగి పోవుట, తాను దైవముతో నుండుట జరుగును.
“బుద్ధిః కర్మాను సారిణి " అను నానుడి కలదు. సామాన్యుల బుద్ధి కర్మల ననుస రించుచు పోవును. అపుడతడు కర్మబద్ధుడగును. బుద్ధిని దైవముతో జోడించి, మన స్సేంద్రియ దేహములతో కర్మలను నిర్వర్తించుట వలన ఆనంద ముండును గాని బంధ ముండదు.
ముందు శ్లోకమున మననము ద్వారా దైవముతో సంబంధము ఏర్పరచుకొనుట తెలుపబడినది. ఆ బంధము పటిష్ఠమైనచో నిర్వర్తించు కర్మల యందు ఫలాసక్తి యుండదు. దైవము నందాసక్తి చెందిన బుద్ధి, ఫలములయం దాసక్తి కలిగి యుండదు. అట్టి వానిని కర్మ లంటవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Jan 2021
No comments:
Post a Comment