🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. వ్యాసమహర్షి - 2 🌻
8. పాండురాజు చనిపోయినప్పుడు కుంతీదేవి దుఃఖపడుతుంటే, ఆమెను వ్యాసుడు ఓదారుస్తూ ఒక్కటేమాట చెప్పాడట, “అమ్మా! కాలంయొక్క స్వరూపం బాగా తెలిసినవాళ్ళు, ఎప్పుడూ కూడా భవిష్యత్తు కంటే గడచిన కాలమే మంచిదని అనుకుంటూ ఉంటారు. ఈ ఒక్కమాట గుర్తుపెట్టుకో! గడిచిపోయినకాలంలో ఉన్నటువంటి సుఖసంపదలను తలచుకోని శాంతిని పొందు.
9. వర్తమానకాలంలో, భవిష్యత్తులో ఎటువంటి ఆశలూ పెట్టుకోవద్దు” అని చెప్పాడు. ఎలాంటి వేదతత్త్వమూ ఆయన చెప్పలేదు. జీవితంలోని సత్యం చెప్పాడు. ఎందుకు చెపుతున్నాడీ విషయం అంటే, అందులో భవిష్యత్తు సూచన ఉంది.
10. పాండవులు పుట్టారు బాగున్నారు అని సంతోషిస్తే, భర్త పోయాడు. వీళ్ళు ఎలా ఉంటారో చెప్పలేము. రాబోయేది మహాభారత యుద్ధం. గొప్పమార్పు ఉంది. అది అందరినీ తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతుంది, ఎవరినీ ఉంచదు.
11. వీళ్ళిక్కడ సుఖపడటానికే పుట్టలేదు. కాబట్టి భవిష్యత్తులోకూడా సుఖము ఆశించవద్దని ఆమెకి వ్యాసుడు చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం, అందరికీ అంతో ఇంతో వర్తిస్తుంది.
12. ఓదార్పు మాటలు సత్యంతో ఉండాలి అబద్ధపు వాగ్దానాలు ఉండకూడదు. అసత్యమయినటువంటి ఆశ, కల్పన దోషయుక్తం. “ఉన్నది ఇదే, యథార్థమని అనుకో. ఇంతకన్న బావుంటే అదృష్టవంతుడివి” అని చెప్పటమే మేలు. కఠినంగా ఉన్నప్పటికీ అదే సత్యం.
13. అత్యుత్తమమయినదేమిటంటే, ఉన్నది యథార్థంగా ఉన్నట్లుగానే గ్రహించి, తపోబలంతో వైముఖ్యం పొందటం. ప్రపంచంవైపు చూడక ధీరుడు తపస్సును ఆశ్రయిస్తాడు. తపస్సులో పెరుగుతాడు.
14. తపస్సు లేని దుఃఖభూయిష్టమైన జన్మ నశిస్తుంది. క్రమక్రమంగా అతడియొక్క తేజస్సు తగ్గిపోతుంది. ఆత్మగౌరవం, మనోబలం నశించి ఇంకా క్షీణదశకు వెళ్ళిపోతుంది మనిషి జీవితం. తపోబలంలో మనిషి ఉన్నతుడవుతాడు. అందుకే తపస్సుకు అంత ప్రాధాన్యం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
16 Jan 2021
No comments:
Post a Comment