✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 2. సుదర్శన చక్రము - 1 🌻
మానవుడు జ్ఞానమార్జించుచూ చేసిన దర్శనములలో సుదర్శన చక్రము ప్రాముఖ్యము వహించును. జ్ఞానమునకు సంబంధించిన సంకేతములలో చక్రము స్వయం సంపూర్ణమైనది.
భారతీయులు, ఈజిప్టు, గ్రీసు, ఛాల్జియా దేశములవారు గుప్త జ్ఞానమును ఆర్జించు కొనునప్పుడు దర్శించిన జ్ఞానమునకు కొన్ని సంకేతముల నేర్పరచుకొనిరి. భారతీయ వాజ్ఞయమున ఈ చక్రమును వృత్తమని పేర్కొనిరి. వృత్తమనగా సమస్తము అని అర్థము. దీనినే పూర్ణమనియు జ్ఞానమనియు కూడ వ్యవహరింతురు.
ఒక జీవియొక్క వృత్తము కాని, ఒక కాలము యొక్క వృత్తముగాని, సర్వజీవుల సర్వ కాలముల వృత్తము కాని, ఈ సమస్తమును వృత్తముగ దర్శించినారు. జ్ఞానమునకు చిహ్నముగా పూర్ణమునకు సంబంధించిన గణితము వేదమున ఇట్లు వివరించినాడు.
పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ
పూర్ణమేవా వశిష్యతే
దీని తాత్పర్యమేమనగా సున్నలో నుండి సున్న తీసివేసినచో సున్నయే మిగిలి యుండును. అనగా సంకల్పమనబడు కేంద్రము ద్వారా పరతత్వము నుండి ఎన్ని బ్రహ్మాండాకాశములు తీసినను, పరతత్వము తరుగదు.
ఒక్కొక్క బ్రహ్మాండము నుండి ఒక్కొక్క సూర్యుడు, నవగ్రహములు పుట్టి పెరిగి అందులో కలసిపోవు చుండును. ఒక్కొక్క భూమిపై గల ఒక్కొక్క వృత్తాకారమగు జ్ఞానము ఇంకొకరికి సంక్రమించినను మిగులుచునే యుండును.
అనగా గురువు తన భావ వృత్తములో వున్న దంతయును శిష్యునకు తీసి ఇచ్చిన తర్వాత కూడా తన భావవృత్తము అట్లే యుండును. జీవులు పరంపరగా నార్జించుకొను జ్ఞాన వృత్తము, ఆ జీవులు మరణించిన తర్వాత కూడ నుండును. మానవజాతి నశించిన తర్వాత కూడ ఈ జ్ఞానమట్లే యుండును. మరల పుట్టిన భూగోళముపై మరల మానవులచే దర్శించబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Jan 2021
No comments:
Post a Comment