✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 94 🌻
ఇది సవ్యమైనటువంటి పద్ధతేనా? ఇది సరైన పద్ధతేనా? అనిటటువంటి విచారణ చేసుకోవల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమండీ, మా అల్లుడు గారికి, సరైన ఉద్యోగం ఇప్పించండి, ఏమండీ, మా అల్లుడుగారి బుద్ధి సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఏమండీ మా అమ్మాయిని సరిగ్గా చూసుకునేటట్లు చూడండి.
ఏమండీ! నన్ను మా ఆయన సరిగ్గా చూసుకునేటట్లు చూడండి. ఏమండీ! మా పిల్లలూ సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఏమండీ! మా మనవళ్ళూ సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఇలా ఎన్ని రకాలుగా ఏ పేరుతో పిలిచి కోరుతూ ఉన్నప్పటికీ, ఈ కోరికలన్నీ ఒకే ఒక కోరికలోకి వెళ్ళిపోతున్నాయి, ఏమిటది? పాహిమాం.
అయితే, ప్రాధమికమైనటువంటి బాల్యదశలో ఇది అవసరం. ఎందుకంటే, అక్కడ ఉచితానుచితములు తెలియనటువంటి అవస్థ కాబట్టి, బాల్యావస్థ యందు భక్తియనే పునాది, విశ్వాసము ఏర్పడ వలసినటువంటి అగత్యమున్నది కాబట్టి, బాల్యము నందే ఈశ్వరానురక్తత ఏర్పడవలసినటువంటి అవసరము ఉన్నది కాబట్టి, బాల్యావస్థ దాటే వరకూ ఈ భక్తిని ఆశ్రయించాలి. పాహిమాం అని ఆర్తితో వేడుకునేటటువంటి లక్షణాన్ని పొందాలి. నిరంతరాయంగా ఈ ఆర్తిని తహని నిలబెట్టుకోవాలి. భక్తి విశ్వాసాలు నిలబెట్టుకోవాలి. ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నించాలి.
కానీ.. చాలా ముఖ్యమైనటువంటిది ఈ ‘కానీ’. చిత్తశుద్ధి లేకుండా ఆత్మవస్తువు యొక్క లక్షణాలను గుర్తించకుండా అంధుడు ఏనుగును నిర్ణయించినట్లుగా నిర్ణయించ పూనుకుని ఉంటే, అప్పుడు ఎప్పటికీ, సమగ్రమైనటువంటి వివేకాన్ని, విజ్ఞానాన్ని పొందలేడు. ఎందువల్ల? ఆ పరమాత్మ అందరి శరీర మధ్యభాగములందున్నాడు.
సర్వభూతస్థమాత్మానాం హృద్దేశోర్జున తిష్ఠతి - ఇలాంటి ప్రయోగాలతో భగవద్గీత యందు తన అధికారిత్వాన్ని, తన అధిష్ఠాన స్థితిని, తన ఆశ్రయాన్ని, తన సర్వాధార స్థితిని, పరమాత్ముడు తెలియజెప్పి ఉన్నాడు. ఎక్కడున్నావయ్యా? అని అర్జునుడు పదే పదే అడుగుతాడు.
ప్రతి యోగంలో కూడా అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. మన తరఫున. మన ప్రశ్నలన్నింటికి కూడా పరమాత్ముడు సమాధానాలు తీరుస్తూ ఉంటాడు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వ్యాసభగవానుడు ఆ సమాధానాలన్నీ ఇస్తూ ఉన్నాడు భగవానుడి ముఖం నుంచి. ఏమని చెబుతున్నాడు? పైగా?
అంగుష్ఠ మాత్ర ఏవ పురుషః నాయనా! సర్వ జీవుల హృదయాకాశమునందు వారి వారి బొటన వేలు ఎంతుందో అంతమేరకు ప్రకాశాన్ని కలిగి ఉన్నాను. ఏమిటండీ, ఈ బొటన వేలు వ్యవహారం? ఏం మిగిలిన వేళ్ళు చెప్పవచ్చు కదా! అంగుష్ఠ మాత్ర ఏవ పురుషః - ఇది ఒక సంజ్ఞా రూపకమైనటువంటి బోధ. ఐదు వేళ్ళు ఉన్నప్పటికి, అంగుష్ఠం లేకపోతే మిగిలిన వాటి వల్ల ప్రయోజనం లేదు.
కాబట్టి, అంగుష్ఠం యొక్క ప్రాధాన్యతను నిర్ణయిస్తూ అట్టి ప్రధాన వస్తువుగా నీలో పురుషుడున్నాడు. వాడు లేకపోతే మిగిలినవి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. అనేటటువంటి సంజ్ఞారూపకమైనటువంటి బోధ. ఇంకొకటి కూడా ఉంది. దీనిని ప్రమాణంగా స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కొద్దిగా అసయంజసమని అనిపిస్తుంది నాకు.
ఎందుకని అంటే, ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెబుతాము? స్వయం ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెబుతాం? ఆత్మ నాలుగు స్థితులందున్నట్లుగా తోస్తున్నది. జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ ఇంకా దేనికి జోడిస్తే ఆ ఆత్మ. పుణ్యాత్మ, పాపాత్మ, వ్యవహారాత్మ. దేనికి జోడిస్తే అదైపోతుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Jan 2021
No comments:
Post a Comment