రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
82. అధ్యాయము - 37
🌻. యజ్ఞ విధ్వంసము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను
అపుడు మహాబలుడగు ఆ వీరభద్రుడు విష్ణువుతోడి యుద్ధమునందు అపదలన్నిటినీ వనివారించు శంకరుని మనస్సులో స్మరించి(1) దివ్యమగు రథమునధిష్ఠించెను. శత్రువులనందరినీ సంహరించే ఆ వీరభద్రుడు గొప్ప అస్త్రమును తీసుకొని సింహ నాదమును చేసెను(2) విష్ణువు కూడా పాంచ జన్యమను పేరుగల, గొప్ప శబ్ధమును చేసే తన మహాశంఖమును, తనవారికి ఆనందమును కలుగు చేయుచున్నాడాయన్నట్లు, మ్రోగించెను(3) ఆ శంఖ నాదమును విని, పూర్వములో యుద్ధమునండి పారిపోయిన దేవతలు కూడ వేగముగా మరలి వచ్చిరి(4)
సైన్య సమేతులగు లోకపాలురు ఇంద్రునితో గూడి సింహనాదమును చేసి వీరభద్రుని గణములతో యుద్ధమును చేసిరి(5) సింహనాదములను చేయుచున్న గణములకు, లోకపాలురకు భయమును గొల్పు సంకుల సమరము జరిగెను(6) ఇంద్రుడు నందితో యుద్ధమును చేసెను. అగ్ని విష్ణు గణములు, మరియు కుబేరుడు బలశాలియగు కూష్మాండపతితో యుద్ధమును చేసిరి(7) అపుడు ఇంద్రుడు వంద ధారలు గల వజ్రముతో నందని కొట్టగా, నంది ఇంద్రుని త్రిశూలముతో వక్షస్థ్సలమునందు కొట్టెను(8)
బలవంతులగు నంది, ఇంద్రుడు ఇద్దరు ఒకరినొకరు జయించు కోరిక గలవారైన, అనేక విధములుగా ఒకరినొకరి కొట్టుకొనుచూ, పట్టుదలతో యుద్దమును చేసిరి(9) మిక్కిలి కోపము గల అగ్ని అశ్మయను గణాధిపతిని శక్తితో కొట్టెను. ఆయన కూడ అగ్నిని వేగముగా వంద ధారలు గల శూలముతో పొడిచెను(10). శివలోకములోని గణములలో అగ్రేసరుడగు వీరుడు ఆనందముతో మహాదేవును స్మరించుచూ, యమునితో సంకుల సమరమునుచేసెను(11) మిక్కలి బలశాలియగు చండుడు నైర్‌ఋతికి ఎదురేగి, పరమాస్త్రములతో అతనిని కొట్టి, పరిహసించుచూ, యుద్దమును చేసెను(12)
వీరుడు, మహాబలుడునగు ముండుడు గన గొప్ప శక్తిచే ముల్లోకములను విస్మయపరుచుచున్నాడా యన్నట్లు వరుణునితో యుద్ధమును చేసెను(13).వాయువు గొప్ప శక్తిగల తన తన అస్త్రముతో భృంగిని కొట్టగా, ప్రతాపశాలియగు భృంగి వాయువును త్రిశూలముతో కొట్టెను(14)
బలవంతుడు, వీరుడునగు కూష్మాంండపతి మనస్సులో మహేశ్వరుని ధ్యానించి, కుబేరునితో యుద్ధమును చేసెను(15). యోగినీ గణములతో కూడియున్న బహాబలుడగు భైరవీ నాయకుడు దేవతలనందరినీ చీల్చి రక్తమును త్రాగెను. ఆదృశ్యము అద్భుతముగ నుండెను(16) మరియు ఆ యుద్ధములో క్షేత్రపాలుడు, ఋభుక్షుడు, కాళి ఆ దేవతలను అధిక సంఖ్యలో చీల్చి రక్తమును త్రాగిరి. (17). అపుడు మహా తేజస్వి, శత్రు సంహారకుడునగు విష్ణువు వారితో యుద్ధమును చేసెను. ఆయన పది దిక్కులను కాల్చి వేయుచున్నాడా యన్నట్లు చక్రమును ప్రయెగించెను(18)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
16 Jan 2021
No comments:
Post a Comment