శ్రీ శివ మహా పురాణము - 335


🌹 . శ్రీ శివ మహా పురాణము - 335 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

84. అధ్యాయము - 39

🌻. విష్ణుదధీచి యుద్ధము -3 🌻

దధీచుడు ఇట్లు పలికెను -


హే విష్ణో! ఈ మాయతో గాని మంత్రశక్తితో గాని పని లేదు. నీవు ప్రయత్న పూర్వకముగా యుద్ధమును చేయుము. ఈ మాయను విడిచిపెట్టుము (40).

దేవతలు ప్రతాపశీలియగు దధీచునితో మరల యుద్ధమును చేయగోరి ఆ నారాయణ దేవుని వేగముగా సమీపించిరి (41). ఆ మహర్షి యొక్క మాటలను వివిన విష్ణువు శంభుతేజముతో నిండియున్న మిక్కిలి కోపించెను. అయిననూ ఆయన భయము లేకుండనుండెను (42).

ఇంతలో అచటకు నేను, నాతో బాటు క్షువుడు చేరుకుంటిమి. పద్మ నాభుడగు విష్ణువును, దేవతలను నేను యుద్ధమును చేయుకుండగా వారించితిని (43). ఆ బ్రాహ్మణుని జయింపశక్యముకాదని చెప్పితిని. హరి నా మాటను విని ఆ మహర్షి వద్దకు వెళ్లి నమస్కరించెను (44). క్షువుడు మిక్కిలి దీనుడై దుఃఖియై ఆ దధీచ మహర్షి వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు ప్రార్థించెను (45).

క్షువుడిట్లు పలికెను -

ఓ మహర్షీ !శివభక్తాగ్రగణ్యా! దయను చూపుము. ఓ పరమేశ్వర స్వరూపా! ప్రసన్నుడవు కమ్ము. దుర్జనులు నిన్ను కన్నెత్తియై ననూ చూడజాలరు (46).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ రాజు యొక్క ఈ మాటను విని తపోనిధి, వేదవేత్తయగు దధీచుడు ఆ రాజును, మరియు దేవతలనందరినీ అను గ్రహించెను (47). అపుడాయన విష్ణువు మొదలగు వారిని చూచి మిక్కిలి కోపించినవాడై హృదయములో శివుని స్మరించి విష్ణువును, దేవతలను కూడ శపించెను(48).

దధీచుడిట్లు పలికెను -

దేవతలు, దేవేంద్రుడు, మహర్షులు, విష్ణు దేవుడు, మరియు ఆయన గణములు రుద్రుని కోపమునే అగ్నిచే వినాశమును పొందెదరు గాక! (49).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు దేవతలను శపించి, మహర్షి తరువాత క్షువుని చూచి ఆతనితో నిట్లనెను. ఓ రాజేంద్రా! బ్రాహ్మణోత్తముని దేవతలు, రాజులు కూడ పూజించవలెను (50).ఓ రాజశ్రేష్ఠా! బ్రాహ్మణులే బలవంతులు, సమర్థులు. ఇట్లు స్పష్టముగా చెప్పి ఆ మహర్షి తన ఆశ్రమమును ప్రవేశించెను (51). క్షువుడు దధీచునకు నమస్కరించి తన గృహమునకు వెళ్లెను. విష్ణువు దేవతలతో గూడి వచ్చిన దారిలో తన లోకమునకు వెళ్లెను (52). ఆ స్థానము స్థానేశ్వరమను పేర పుణ్యక్షేత్రము అయెను. స్థానేశ్వరమును చేరి దర్శించిన వారు శివసాయుజ్యమును పొందెదరు (53).

ఓ కుమారా! నీకు క్షువదధీచుల వివాదమును, త్రిమూర్తులలో శివుడు తక్క మిగిలిన ఇద్దరు అనగా బ్రహ్మ విష్ణువులు పొందిన శాపములను గూర్చి సంక్షేపముగా చెప్పితిని (54). ఈ క్షువ దధీచ వివాదమును నిత్యము కీర్తించు మానవుడు అపమృత్యువును జయించి, దేహమును వీడిన తరువాత బ్రహ్మలోకమును పొందును (55). ఎవరైతే దీనిని కీర్తించి, తరువాత యుద్ధమునకు బయలు దేరునో, వానికి మృత్యు భయము ఉండదు. మరియు ఆతడు విజయమును పొందగలడు (56).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో విష్ణు దధీచి యుద్ధవర్ణనమనే ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2021

No comments:

Post a Comment