భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 220


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 220 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. జైమినిమహర్షి - 5 🌻


24. అందుకనే భిక్షాటనము చేసుకునేటటువంటి విప్రుడు వేదం చదువుకునేటప్పుడు, వేదంచదువుకుంటూ మూడు ఇళ్ళల్లోనో, అయిదు ఇళ్ళల్లోనో, లేకపోతే ఎనిమిది ఇళ్ళల్లోనో “భవతీ భిక్షాందేహి” అని అడుగుతాడు.

25. అలా సంపాదించిన దాంట్లో మొత్తం నాలుగు భాగాలు చేస్తాడు. ఆశ్రమవాసులు కూడా అంతే! వాళ్ళుకూడా అలా భిక్షచేసి తెచ్చుకునేదే! మొదటిభాగాన్ని గోవుకు పెడతారు. రెండోభాగం, ప్రక్కన ఎవరయినా భిక్షాటనానికి వెళ్ళనివారు ఉంటే వాళ్ళకు పెడతారు.

26. మూడోభాగాన్ని బ్రాహ్మణుడిని వెతుక్కుంటూవెళ్ళి ఆయన కాళ్ళమీదపడి ఆయన తీసుకొనేటట్లుగా ప్రార్థించి ఆయనకు ఆ భిక్షటనాన్నం ఇస్తారు. మిగిలిన నాలుగోభాగాన్ని వాళ్ళు తింటారు. తెలివితక్కువవారా వాళ్ళు? “వాళ్ళే భిక్షాటనంచేసి తెచ్చిన భిక్షను ఇతరులకు పెట్టి – దానంచేసి – మిగిలిన దానిని తాము తింటుంటే, రాజువైఉండి నువ్వు దానం చెయ్యక పోవటం ఏమిటి? అని అడిగాడు రాజును జైమిని మహర్షి.

27. “ఈ ఐశ్వర్యం నీదని ఎలా అనుకుంటున్నావు? ఈ ఐశ్వర్యమంతా ప్రజలది, దేశానిది. ప్రతీవాడూ ఈ ఐశ్వర్యంనాది అనుకోవటంవలన దానం అనే విషయం పుడుతున్నదక్కడ. ‘ఏదీ కూడా నాది కాదు’ అనుకోవడంచేత, దానంచేసే అహంభావంతోకాకుండా దానం ఇచ్చేస్తాడు. అడిగినవాడిదే ఇది.

28. ‘ఈ పూట నాఇంట్లో ఇంత బియ్యము ఉందంటే, వచ్చి అడిగి భోజనంచేసే అతిథి ఎవరయితే వస్తారో, నా భాగ్యంచేత ఆ అతిథి తన భోజనం తాను చేసాడు. లేకపోతే ఏమయ్యేది? అతడి ధనం నేను దాచుకుని ఉండేవాణ్ణి!’ అని అనుకోవాలి. అలా ఉండాలి దృక్పథం. అంటే, పరధనం నా దగ్గర ఉన్నట్లు భావిస్తే, నాకు అహంకారం కలుగదు. సహజమైన ఈ విభూతితో – ఈ జ్ఞానంలో ఉన్నవారికి వాళ్ళల్లో దానాహంకారం ఉండదు.

29. ఆర్యధర్మంలో మామూలుగా గృహస్థుడు తన క్షేమంకోరే దానంచేస్తాడు. మోక్షంకోరేవాడు త్యాగంచేస్తాడు. త్యాగంవేరు, దానంవేరు. ఉన్నదాంట్లో ఒకభాగం ఇవ్వటం దానం. ఉన్నదంతా ఇచ్చివేస్తే అది త్యాగం. త్యాగం మోక్షహేతువవుతుంది. దానం పుణ్యహేతువవుతుంది.

30. పుణ్యంవల్ల మోక్షంరాదు. ఈ జీవుడికి పుణ్యమే ఆవశ్యకత. ఎంతవాడైనాసరే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఈ ఆకలిదప్పులు – అంటే దుఃఖంతో మృత్యువాతపడ్డ తరువాత, అతడు పొందేటటువంటి బాధలు ఏవయితే ఉన్నాయో, అవి అదానదోషంవలనే కలుగుతాయి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2021

No comments:

Post a Comment