శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 242 / Sri Lalitha Chaitanya Vijnanam - 242


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 242 / Sri Lalitha Chaitanya Vijnanam - 242 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀

🌻 242. 'చారుహాసా" 🌻

అందమైన హాసము కలది శ్రీదేవి. శ్రీమాత జగన్మోహిని. ఆమె అందము కొలతల కందనిది. ఆమె నవ్వు ఎట్టి మూర్ఖునైనను వశపరచుకొన గలదు. భస్మాసురుని నుండి సదాశివుని వరకు అందరును ఆమె మందస్మితమునకు లోబడువారే. ఆమె పరమశివునికే వశ్య. ఇతరములన్నియూ ఆమె వశములే.

హాసమనగా చిఱునవ్వు. వికటమగు నవ్వు హాసము కాదు. అది వికారము. పగలబడి నవ్వుట లోతగు జీవుల కుండదు. నవ్వకుండుట యుండదు. ప్రతి జీవుడు ఏదో ఒక సమయమున నవ్వుట జరుగును.

కాని ఎప్పుడూ చిఱునవ్వుతో నుండుట అందరికినీ సాధ్యమా? సమస్యలంటని వారే అట్లుండగలరు. సమస్యలుండుట సామాన్యము. అంటకుండుట అసామాన్యము. శ్రీకృష్ణుడొక్కడే సమస్య లంటని వాడు. శ్రీకృష్ణుడనగా శ్రీమాతయే. వీరిరువురే నిజమునకు చారుహాసులు. స్మిత వదనులు. వీరెల్లప్పుడునూ చెదరని చిఱునవ్వుతో నుందురు.

చిఱునవ్వుగల రూపమునే ఆరాధన చేయవలెను. చిఱునవ్వును చూచినపుడు సహజముగ ఆకర్షింపబడుదుము. నిజమగు శ్రీవిద్యా ఉపాసకులకు శ్రీమాత అనుగ్రహముగ ముఖమున చిఱునవ్వుండును. అమ్మ అనుగ్రహమే వారియందు చిఱునవ్వుగ భాసించును.

సహజముగ ఆనందమున నుండువారే ఇట్టి నవ్వు కలిగియుందురు. లోన ఆనందము లేనపుడు ప్రయత్నించినను చిఱునవ్వు ముఖముపై నుండదు. పై పై నవ్వులు వెకిలిగనే గోచరించును. లోన ఆ ఆనందముతో కూడిన నవ్వే చూపరుల కానందము కలిగించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 242 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Cāru-hāsā चारु-हासा (242) 🌻

Her smile is in line with Her appearance. Her smile (hāsa) is compared to the moon. Her smile is the cause of bliss experienced by Her devotees.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



28 Mar 2021

No comments:

Post a Comment