గీతోపనిషత్తు -189


🌹. గీతోపనిషత్తు -189 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚


శ్లోకము 30

🍀 30. వాసుదేవోపాసన - సమస్త భూతముల యందును ఎవడు నన్ను చూచునో, అట్లే సమస్త భూతములను నా యందు చూచునో అట్టి వానికి నేను కనబడకపోను. అట్టివాడు నాకు కనబడకపోడు. ఇది శ్రీకృష్ణుని యొక్క అంతర్వాణి స్వరూపము. కృష్ణుడు తనను అన్నిట దర్శించును. అన్నిటిని తన యందు కూడ దర్శించును. అతడు విశ్వాత్మ. విశ్వరూపుడు. సమస్తము నందు వసించి యుండువాడు. సమస్తము అతనియందే వసించి యున్నది కనుక వాసుదేవుడు. వాసుదేవోపాసన మనగ ఇదియే సమస్తము నందును, తనయందును నిత్యము దైవమును దర్శించువాడు వాసుదేవోపాసకుడు. 🍀

యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || 30

సమస్త భూతముల యందును ఎవడు నన్ను చూచునో, అట్లే సమస్త భూతములను నా యందు చూచునో అట్టి వానికి నేను కనబడకపోను. అట్టివాడు నాకు కనబడకపోడు. ఇది శ్రీకృష్ణుని యొక్క అంతర్వాణి స్వరూపము. కృష్ణుడు తనను అన్నిట దర్శించును. అన్నిటిని తన యందు కూడ దర్శించును. అతడు విశ్వాత్మ. విశ్వరూపుడు. సమస్తము నందు వసించి యుండువాడు. సమస్తము అతనియందే వసించి యున్నది కనుక వాసుదేవుడు.

వాసుదేవోపాసన మనగ ఇదియే సమస్తము నందును, తనయందును నిత్యము దైవమును దర్శించువాడు వాసుదేవోపాసకుడు. దినచర్యలో తనకు గోచరించు సమస్త జీవులయందును, వస్తువుల యందును, ప్రకృతి యందును దైవమును దర్శించుట నిజమగు సాధన. ఇట్టి సాధన చేయువారికి దినచర్యయే యోగ సాధనగ సాగును. యోగజీవనము అలవడును. ఇట్టివారు ప్రత్యేక ముగ క్రతువులు, ఆరాధనలు, అభిషేకములు, హోమములు చేయు అగత్యము లేదు. చేయుట వారి ముచ్చట.

యోగసాధనము వేరుగను, యోగజీవనము వేరుగను భావించువారు అజ్ఞానమున పడినవారు. యోగసాధన పేరిట వారు మోహము చెంది మాయలో పడుదురు. అట్లే భక్తులు, జ్ఞానులు కూడ. అన్నిట, అంతట దైవమే నిండియున్నపుడు చూచుట దైవమును చూచుటగనే యుండవలెను. వినుట దైవమును వినుటగనే యుండవలెను. సంభాషించుట దైవముతో సంభాషించుటగ యుండవలెను. సేవ చేయుట దైవమునకే అని తెలిసి చేయ వలెను.

తనకు సేవచేయువారి రూపములో కూడ దైవమే యున్నా డని తెలియవలెను. తన లోపల బయట కూడ ఉన్నది దైవమే అయినపుడు, దానిని చూచునపుడు అది తనను చూచును. దానిని వినుచుండు నపుడు అది తనను వినును. తాను సేవించునపుడు, తనను కూడ సేవించును. ఈ విషయమున ఎట్టి సందేహము అవసరము లేదు. ఇది ముమ్మాటికిని సత్యము.

అర్జునునికి బోధ చేయు సమయమున కృష్ణుడు, తాను అంతర్యామిగ బోధించెనే గాని ఒక వ్యక్తిగ బోధించలేదు. ఇది సాధనల కన్నిటి కన్నను ఉత్తమమైన సాధన. జీవితమందు మిళితమైన సాధన. ఈ నిత్య జీవన సాధన నిత్యయోగ జీవనమై నిలచును. ఇట్టి వానికి దైవముతో అవినాభావ సంబంధ మేర్పడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


22 Apr 2021

No comments:

Post a Comment