శ్రీ శివ మహా పురాణము - 389


🌹 . శ్రీ శివ మహా పురాణము - 389 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 16

🌻. బ్రహ్మ దేవతల నోదార్చుట - 3 🌻


ఆ హిమవత్పుత్రిక ఇప్పుడు పూర్ణ¸°వనమై ఉన్నది. హిమవత్పర్వముపై తపస్సును చేయుచున్న శివుని ఆమె ప్రతి దినము చక్కగా సేవించుచున్నది(32). శివపత్నియగు ఆ కాళి హిమవంతుని మాటను బట్టి, మరియు తన పట్టుదలవలన, ధ్యానమునందున్న పరమేశ్వరుని ఇద్దరు సఖురాండ్రతో గూడి సేవించుచున్నది.(33) ముల్లోకములలో సుందరియగు ఆమె తన ఎదుట సేవను చేయుచున్ననూ, ధ్యానమగ్నుడగు మహేశ్వరుడు ఆమెను మనస్సులోనైననూ కోరుకొనలేదు(34) ఓ దేవతలారా! ఆ చంద్రశేఖరుడు తొందరలోనే ఆ కాళిని భార్యను చేసుకొని కోరికను పొందునట్లు మీరు దృఢమగు యత్నమును చేయుడు(35)

తరువాత నేను ఆ తారకుని స్థానమునకు వెళ్లి అతనిని తన చెడు పట్టుదలనుండి నివారించగలను. ఓ దేవతలారా! మీ స్థానమునకు వెళ్లుడు (36). నేను దేవతలతో నిట్లు పలికి. వెంటనే తారకాసురిని వద్దకు వెళ్లి, మిక్కిలి ప్రీతితో పిలిచి, ఇట్లు చెప్పితిని (37) ఈ స్వర్గము తేజస్సు యొక్క సారము. నీవు మా రాజ్యమును పాలించుచున్నావు. నీవు దేవిని కోరి గొప్ప తపస్సును చేసితివో, అంతకు మించి ఇప్పుడు కోరుచుంటివి.(38) నేను నీకు ఇచ్చిన వరము ఇంతకంటె తక్కువది. నేను స్వర్గ రాజ్యవరమును నీకీయలేదు. కావున నీవు స్వర్గమును విడిచిపెట్టి, భూమిపై రాజ్యము నేలుము (39).

ఓ రాక్షసశ్రేష్ఠా! స్వర్గమునకు ఉచితమగు భోగములన్నియూ అచట కూడ ఉండగలవు. నీవీ విషయములో చింతిల్లకుము (40). నేను ఇట్లు పలికి ఆ రాక్షసుని ఒప్పించితిని. సర్వేశ్వరుడనగు నేను ఉమా పరమేశ్వరులను స్మరించి, అచటనే అంతర్ధానమైతిని (41). తారకుడు కూడా స్వర్గమును వీడి భూలోకమునకు వెళ్లి, శోణితనగరమునందున్నవాడై ముల్లోకముల నేలెను (42). నా ఈ మాటను విని దేవతలందరు నాకు ప్రణమిల్లి ఇంద్రునితో గూడి ప్రేమపూర్వకముగా స్వర్గమునకు వెళ్లిరి (43). అచటకు వెళ్లి ఆ దేవతలందరు తమలో తాము చర్చించుకొని ప్రేమ పూర్వకముగా ఇంద్రునితో నిట్లనిరి (44).

దేవతలిట్లు పలికిరి-

ఓ ఇంద్రా! కాముని ప్రభావముచే శంభునకు శివాదేవి యందు అనురాగము కల్గునట్లు నీవు ప్రయత్నించవలెను. ఈ విషయమునంతనూ బ్రహ్మగారు చెప్పియున్నారు గదా! (45)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలు ఈ తీరున దేవరాజునకు వృత్తాంతమునంతనూ నివేదించి, ఆనందముతో గూడిన వారై తమ తమ స్థానములకు వెళ్లిరి (46).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీ ఖండములో దేవతల నోదార్చుట అనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


22 Apr 2021

No comments:

Post a Comment