గీతోపనిషత్తు -201
🌹. గీతోపనిషత్తు -201 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 42
🍀 41. యోగిజన్మ - యోగాభ్యాసి యోగ విద్య యందు ప్రవేశించి శ్రద్ధతో యోగము చేయుచు, యోగసిద్ధి చెందకయే మరణించినచో అతని యోగాభ్యాస నాణ్యతను బట్టి యోగుల కుటుంబముననే జన్మించ గలడు. అచట దైవీ వాతావరణము సహజముగ నుండును. భక్తి జ్ఞానము లుండును. మానవజన్మ యోగుల కుటుంబమున జరిగి నచో అంతకన్న గొప్ప అవకాశము జీవునకు మరియొకటి లేదు. ముందు జన్మలు ఉత్తమముగ నుండ వలెనన్నచో, శుభ వాసనల నాశ్రయించుట కర్తవ్యమై నిలచును. అట్లే యోగుల కుటుంబములలో జన్మించుట కూడ పూర్వ వాసనలను బట్టి యుండును. 🍀
అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ || 42
యోగాభ్యాసి యోగ విద్య యందు ప్రవేశించి శ్రద్ధతో యోగము చేయుచు, యోగసిద్ధి చెందకయే మరణించినచో అతని యోగాభ్యాస నాణ్యతను బట్టి యోగుల కుటుంబముననే జన్మించ గలడు. యోగుల కుటుంబమున జన్మించుట, శ్రీమంతుల కుటుంబమున జన్మించుట కన్న శ్రేష్ఠమని తెలుపబడు చున్నది. యోగుల కుటుంబములో జన్మించినపుడు పూర్వ జన్మ వాసనల వలన చిన్నవయస్సుననే యోగమున ప్రవేశించుటకు అవకాశ మేర్పడును.
యోగుల కుటుంబమందు దైవీ వాతావరణము సహజముగ నుండును. భక్తి జ్ఞానము లుండును. చిల్లర విషయములు గూర్చి చర్చగాని, చేష్టగాని యుండదు. భారత భాగవత రామాయణాది సద్ధంథముల చర్చలు, యోగాభ్యాస పరమైన ప్రవర్తన యుండును.
యోగము కొనసాగుట కంతకన్న ఉత్తమమైన వాతావరణము ఏమి కావలయును? ప్రపంచమున అన్ని రకముల జన్మల కంటెను మానవ జన్మ ఒక అదృష్టము. అట్టి మానవజన్మ యోగుల కుటుంబమున జరిగి నచో అంతకన్న గొప్ప అవకాశము జీవునకు మరియొకటి లేదు. ధనికులు, అధిపతులు, రాజాధిరాజుల జన్మల కన్న యోగుల జన్మమే గొప్పది.
ఇంద్రుని జన్మ కన్న కూడ యోగిజన్మ గొప్పది. యోగులు ధీమంతులు. ఆత్మారాములు. నిష్కపటులు. వారు కేవలము ప్రపంచమునకు హితము చేయుటకే జన్మింతురు. అట్టి వారి కుటుంబములలో పుట్టుట మహాదుర్లభమైన విషయము.
వశిష్ఠ మహర్షి సాక్షాత్తు బ్రహ్మమే. అతని కుటుంబమున పుట్టిన శక్తి మహర్షి సూటిగ ధ్యానమందు నిలచి, బ్రహ్మమును చేరి బ్రహ్మమై యున్నాడు. అతని కుమారునిగ జన్మించిన పరాశర మహర్షి మహాయోగియై, జగద్గురువై, మైత్రేయాది జగద్గురువులకు కూడ గురుస్థానము నలంకరించినాడు. పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు. తండ్రిని మించిన తనయుడు.
తండ్రి అందించిన యోగమును, ధ్యానమును సమస్తమును విపులీకరించి, వేదము లను నిర్వచించి, పురాణములను వర్గీకరించి, భారత భాగవతాది గ్రంథములు రచించి, కలియుగమందు మానవులు తరించుటకు మహత్తర కృషి గావించినాడు. అతని కుమారుడు శుకుడు చిన్నతనముననే బ్రహ్మత్వము సాధించినాడు.
యోగస్పర్శ గలవారే యోగుల కుటుంబమున జన్మింతురు. అట్లు జన్మించి యోగసిద్ధిని పొందుదురు. నిజమునకు జీవులు మరణ సమయమునకు ఏ యే వాసనలు కలిగియుందురో ఆయా వాసనల పరితృప్తికై తదనుగుణమైన వాతావరణమున మరల జన్మింతురు. అట్లే యోగవాసన ప్రబలముగ నుండగ మరణించినవారు యోగుల కుటుంబమున జన్మింతురు.
గుఱ్ఱమునకు గుఱ్ఱము, గాడిదకు గాడిద పుట్టుట ప్రకృతి విధానము. కాకికి కోకిల పుట్టదు. కోకిలకు కాకి పుట్టదు. శుభవాసనలు గలవారు శుభంకరమగు గృహములలో జన్మింతురు. అశుభ వాసనలు గలవారు అట్టి వాసనలు గల కుటుంబములలో జన్మింతురు. సామాన్యముగ శుభాశుభ మిశ్రమముగ వాసనలుండును.
కావున అట్టి కుటుంబములో జన్మించుట జరుగును. ముందు జన్మలు ఉత్తమముగ నుండ వలెనన్నచో, శుభ వాసనల నాశ్రయించుట కర్తవ్యమై నిలచును. అట్లే యోగుల కుటుంబములలో జన్మించుట కూడ పూర్వ వాసనలను బట్టి యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
22 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment