శ్రీ శివ మహా పురాణము - 401
🌹 . శ్రీ శివ మహా పురాణము - 401🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 20
🌻. బడబాగ్ని - 2 🌻
గొప్ప సామర్థ్యము గల ఈ మహేశ్వరుని క్రోధము మన్మథుని భస్మము చేసి, వెను వెంటనే సర్వమును తగులబెట్టుటకు తలపడగా, నేను బడబాగ్నిగా స్తంభింపజేసితిని (14). దుఃఖితులగు దేవతలు నన్ను శీఘ్రమే ప్రార్థించగా నేను సంకరుని ఇచ్ఛచే శీఘ్రముగా అచటికి వచ్చితిని. ఓ కుమారా! నేనా అగ్నిని స్తంభింపజేసితిని (15).
ఓ సముద్రమా! బడబారూపమును ధరించిన ఈ అగ్నిని తీసుకొని కరుణానిధియగు నేను ఇచటకు వచ్చి నిన్ను ఆదేశించుచుంటిని (16). ఈ మహేశ్వరుని క్రోధము బడబా రూపమును ధరించి నోటినుండి నిప్పులను గ్రక్కుచున్నది. ప్రలయకాలము వరకు నీవు దీనిని ధరించవలెను. (17) ఓ నదీ పతీ! నేను ఇచటకు వచ్చి ప్రలయములో నివసించగలను. అపుడు నీవు ఈ శంకరుని అద్భుతమగు క్రోధమును విడిచిపెట్టవచ్చును (18). ఈ అగ్నికి నీ జలము నిత్యము భోజనమగుచుండును. ఈ అగ్ని నీ గర్భములోనికి వెళ్లకుండునట్లు నీవు ప్రయత్న పూర్వకముగా ధరించి యుండుము (19).
బ్రహ్మ ఇట్లు పలికెను-
నేనిట్లు పలుకగా, అపుడా సముద్రుడు రుద్రుని కోపరూపమగు ఆ బడబాగ్నిని ధరించుటకు నిశ్చయముగా నంగీకరించెను. ఆ పనిని సముద్రుడు తక్క ఇతరులు చేయజాలరు (20). అపుడు జ్వాలలతో మండిపడుచున్న ఆ అగ్ని బడబా రూపముతో సముద్రములో ప్రవేశించి జలసమూహములను దహింపనారంభించెను (21). ఓ మహర్షీ! అపుడు సంతసముతో నిండిన మనస్సుగల వాడనై నేను నాలోకమునకు వెళ్లితిని. దివ్యరూపము గల సముద్రుడు నాకు ప్రణమిల్లి అంతర్దానము జెందెను (22). ఓ మహర్షీ! రుద్ర కోపాగ్ని వలన కలిగిన భయమునుండి జగత్తు సర్వము విముక్తిని పొందెను. దేవతలు మరియు ఋషులు స్వస్థులైరి (23).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో బడబాగ్ని చరితమనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
22 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment