గీతోపనిషత్తు -207


🌹. గీతోపనిషత్తు -207 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 46, 47, Part 3

🍀 45-3. యోగీభవ - యోగి అనగా దైవముతో యోగము చెంది యుండు వాడు. అట్టివాని నుండి దైవమే సర్వము నిర్వర్తించును. తానుగ అతడేమియు నిర్వర్తించడు. ఇట్టి యోగస్థితి కన్న సుందరము వైభవము అగు జీవనము లేదు. అతడు తన కొరకు గాక దైవము కొరకు, దైవము నందు వసించి యుండును. 🍀


అట్టి యోగికన్న దైవమునకు ప్రియు డెవ్వరును లేరు. యోగి అనగ భక్తుడే. దైవముతో విభక్తి లేక యుండును. అతని యందు జ్ఞానము భాసించును. మహత్తరమగు కార్యములు జరుగును. ఈ రహస్యములు తెలియుటకే రామాయణమున సుందరకాండము ఈయబడినది.

హనుమంతుడు పరులు గుర్తింప లేని మహాయోగి. హనుమంతుని జీవితము తనకొరకు జీవింపబడ లేదు. దైవము కొరకే తన ఉనికి. అతడు సహజయోగి. అతని యందు నాలుగు వేదములు భాసించును. అతనిని మించిన జ్ఞాని లేడు.

కాని అతడు జ్ఞానమునకు తగులుకొని యుండడు. అతడు మహత్తరమగు కార్యములను నిర్వర్తించెను. అతడు సాధించిన కార్యములు అనితర సాధ్యము. కాని వానిని గూర్చిన జ్ఞప్తి కూడ అతనికి ఉండదు. అతడు నిత్య తపస్వి. విశ్వాత్మ రాముని చింతనలో తనను తాను మరచి యుండును.

తాను భక్తుడనని, యోగినని, జ్ఞానినని, శక్తివంతుడనని భావింపడు. తన భావన, తను భావన లేక కేవలము బ్రహ్మము వలె వసించి యుండును. శ్రీకృష్ణుడు అర్జునునకు యోగమును బోధించు సమయమున అర్జునుని రథము పై జెండావలె యుండెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Jun 2021

No comments:

Post a Comment