శ్రీ శివ మహా పురాణము - 407
🌹 . శ్రీ శివ మహా పురాణము - 407🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 22
🌻. పార్వతీ తపోవర్ణనము - 3 🌻
అపుడా పార్వతి తల్లితండ్రులకు ఆనందముతో ప్రణమిల్లి సకురాండ్రిద్దరితో గూడినదై, శివుని స్మరించి తపస్సును చేయుటకై ఇంటినుండి బయులదేరెను (28).
ఆమె తనకు ప్రీతిపాత్రములగు వివిధ వస్త్రములను విడనాడి నారబట్టలను ధరించి ముంజత్రాడును బంధించి శోభిల్లెను (29). ఆమె హారమును వీడి చక్కని మృగచర్మను ధరించి తపస్సు చేయుటకై, గంగానది దివినుండి భువికి దిగిన స్థానమును చేరుకొనెను (30).
గంగావతరణమని ప్రసిద్ధి గాంచిన ఆ హిమవంతుని శిఖరముపైననే శంభుడు ధ్యానము చేయుచూ, విఘ్న కారకుడు మన్మథుడు దహించెను (31). హిమవంతుని ఆ శిఖరమునకు జగదంబయగు పార్వతీ దేవి విచ్చేసెను. ఓ వత్సా! అచట ఆమెకు శివుడు ఎచ్చటనూ కానరాలేదు (32).
ఏ స్థలములో పూర్వము శంభుడు కూర్చుండి ఘోరమగు తపస్సును ఆచరించినాడో, అదే స్థలమునందు ఆమె క్షణ కాలము నిలుచుండి విరహముచే దుఃఖితురాలయ్యెను (33). ఆ పార్వతీ దేవి చింతాశోకములతో నిండిన మనస్సు గలదై మిక్కిలి దుఃఖితురాలై ఆచట 'హా హారా!' అని బిగ్గరగా రోదించెను (34).
తరువాత చాల సేపటికి ఆ పార్వతీ దేవి ధైర్యమును వహించి, మోహమును వీడి, తపోనియమముల నారంభించుటకై దీక్షను గైకొనెను (35). పరమ పవిత్ర తీర్థమగు ఆ శిఖరము నందామె తపస్సును చేసెను. ఆమె తపస్సును చేయుటచే ఆ శిఖరమునకు గౌరీశిఖరమను పేరు వచ్చినది (36).
ఓ మహర్షీ! తపస్సును చేయు కాలము యొక్క గణన కొరకై ఆమె అచట సుందరమైనవి, పవిత్రమైనవి, పండ్లను ఇచ్చునని అగు వృక్షములను పాతెను (37).
సుందరియగు ఆ శివాదేవి అచట భూమిని శుద్ధిచేసి వేదికను నిర్మించి, తరువాత మునులకైన చేయ శక్యముగాని కఠిన తపస్సును చేయుట ఆరంభించెను (38). ఆమె వెనువెంటనే మనస్సును, ఇతర ఇంద్రియములనన్నింటినీ నిగ్రహించి, శివుడు తపస్సు చేసిన స్థానమునకు సమీపములో గొప్ప తపస్సును చేసెను (39).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment