గీతోపనిషత్తు -208
🌹. గీతోపనిషత్తు -208 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 46, 47, Part 4
🍀 45-4. యోగీభవ - హనుమంతుడు పరులు గుర్తింప లేని మహాయోగి. హనుమంతుని జీవితము తనకొరకు జీవింపబడ లేదు. దైవము కొరకే తన ఉనికి. అతడు సహజయోగి. అతని యందు నాలుగు వేదములు భాసించును. అతనిని మించిన జ్ఞాని లేడు. కాని అతడు జ్ఞానమునకు తగులుకొని యుండడు. 🍀
అతడు మహత్తరమగు కార్యములను నిర్వర్తించెను. అతడు సాధించిన కార్యములు అనితర సాధ్యము. కాని వానిని గూర్చిన జ్ఞప్తి కూడ అతనికి ఉండదు. అతడు నిత్య తపస్వి. విశ్వాత్మ రాముని చింతనలో తనను తాను మరచి యుండును.
తాను భక్తుడనని, యోగినని, జ్ఞానినని, శక్తివంతుడనని భావింపడు. తన భావన, తను భావన లేక కేవలము బ్రహ్మము వలె వసించి యుండును. శ్రీకృష్ణుడు అర్జునునకు యోగమును బోధించు సమయమున అర్జునుని రథము పై జెండావలె యుండెను.
అధర్మమునకు ప్రతికూలముగ, ధర్మమునకు అనుకూలముగ వాయువులను ప్రసరింపజేసి అర్జునునకు తోడ్పడెను. అతడి యునికి ఎవరు గుర్తించిరి? సహాయము పొందినవారు కూడ గుర్తింపలేని రీతులలో సహాయము చేయు మహాయోగి.
అట్టివాడు కృష్ణుడు అర్జునునికి బోధించినపుడు అచటనే యున్నాడు. అతని యునికి కృష్ణునికే తెలుసును. యోగులను గూర్చి ఎంత వివరించినను అది అసంపూర్ణమే యగును. అందువలన శ్రీకృష్ణుడు అర్జునునికి జీవిత గమ్యమును నిర్వచించి మార్గమును నిర్దేశించెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
05 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment