శ్రీ శివ మహా పురాణము - 408


🌹 . శ్రీ శివ మహా పురాణము - 408🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 22

🌻. పార్వతీ తపోవర్ణనము - 4 🌻


గ్రీష్మ కాలములో చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లు చుండగా ఆమె మధ్యలో కూర్చుండి రాత్రింబగళ్లు నిరంతరముగా మంత్రమును జపించెను (40). వర్షకాలమునందు ఆమె వేదికపై స్థిరమగు ఆసనములో కూర్చుండి, లేదా రాయిపై గూర్చుండి నిరంతరముగా జపము చేయుచుండగా, ఆమెపై జలధారలు వరషించెడివి (41).

భక్తి యందు తత్పరురాలైన ఆ పార్వతి ఆహారము లేనిదై శీతకాలములో మంచు కురియు రాత్రులందు కూడా నీటి మధ్యలో నిరంతరముగా నిలబడి తపస్సును చేసెను (42). ఈ విధముగా శివాదేవి పంచాక్షరీ జపమునందు నిమగ్నురాలై తపస్సును చేయుచూ, సర్వకామనలను ఫలములను ఇచ్చు శివుని ద్యానించెను (43).

ఆమె ప్రతిదినము సఖురాండ్రతో గూడి తాను పాతిన శుభకరమగు వృక్షములకు నీరు పోసెడిది. ఆమె అచట అతిథులకు ఆనందముతో స్వాగత సత్కారముల నిచ్చెడి (44). దృఢమగు చిత్తముగల ఆ పార్వతి సహింప శక్యము గాని గాలిని, చలిని, వర్షమును, మరియు ఎండలను, ఇట్టి వివిధ వాతావరణములను సహించెను (45).

ఆమె తనకు సంప్రాప్తమైన వివిధ దుఃఖములను లెక్క చేయలేదు. ఓ మహర్షి ఆమె మనస్సును శివుని యందు మాత్రమే లగ్నము చేసి నిర్వికారముగా నుండెను (46). ఆ దేవి ముందు ఫలములను ఆ తరువాత పత్రములను భుజించి తపస్సు చేసెను. ఆమె ఇట్లు వరుసగా అనేక సంవత్సరములను తపస్సుతో గడిపెను (47).

పర్వత పుత్రియగు ఆ శివాదేవి తరువాత పత్రములను కూడ విడనాడి, ఆహారమును భుజించకుండగనే తపస్సును చేయుటలో నిమగ్నమాయెను (48). ఆమె పత్రములను కూడ భుజించుట మానివేసినది గనుక, ఆ పార్వతీ దేవికి దేవతలు అపర్ణ అను పేరును ఇచ్చిరి (49).

ఆ పార్వతి ఒంటి కాలిపై నిలబడి శివుని స్మరిస్తూ పంచాక్షర మంత్రమును జపిస్తూ గొప్ప తపస్సును చేసెను (50). నార బట్టలను ధరించిన ఆమె యొక్క కేశములు జడలు గట్టినవి. శివుని ఆరాధించుట యందు లగ్నమైన మనస్సు గల ఆ దేవి తపస్సును చేయుటలో మునులను కూడ జయించెను (51).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


05 Jun 2021

No comments:

Post a Comment