గీతోపనిషత్తు -209


🌹. గీతోపనిషత్తు -209 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 46, 47, Part 5


🍀 45-5. యోగీభవ - కర్మము సుళువు తెలిసి కర్మమున నిలచి, దానముల విలువ తెలిసి, దానధర్మాదుల నాచరించుచు, ద్వంద్వముల మాయ తెలిసి వానియందు సమ్యక్ న్యాసము చెంది, తద్వారమున యతచిత్తుడై బుద్ధిని చేరి, బుద్ధియను వెలుగు మూలమును ధారణచేసి, ధ్యానించి ఆత్మగ తనను తాను తెలియుట ఈ మొత్తము సాధన. 🍀

ఆత్మ సంయమ యోగము అను ఈ ఆరవ అధ్యాయము ధ్యాన యోగమని పిలుతురు. ఆత్మ సంయమమునకు వలసిన సూత్రము లన్నియు ఈ ఆరు అధ్యాయముల యందు భగవంతుని పలుకులుగ తెలుపబడినవి. ఇవి అత్యంత గంభీరములు. ఇందలి రహస్యము లన్నియు శ్రద్ధ గలవారికి గోచరింపగలవు. వానిని భక్తి శ్రద్ధలతో అభ్యసించువాడు తప్పక యోగి కాగలడు.

ఈ సూత్రములు ఆచరణకే గాని పారాయణకు కాదు. ఆచరించినవారు తరించుట తథ్యము. ఆచరించని వారు తరించకుండుట కూడ తథ్యము. గీతా సూత్రములను అవగాహన చేసుకొనుట, ధీరతతో ఆచరించుట తరుణోపాయము. ఈ సూత్రముల వైశిష్యము లెక్క చేయక దొడ్డిదారులలో గమ్యమును చేరవలెనని భావించువారు తమకు తాము మోసగించుకొనువారు.

కర్మము సుళువు తెలిసి కర్మమున నిలచి, దానముల విలువ తెలిసి, దానధర్మాదుల నాచరించుచు, ద్వంద్వముల మాయ తెలిసి వానియందు సమ్యక్ న్యాసము చెంది, తద్వారమున యతచిత్తుడై బుద్ధిని చేరి, బుద్ధియను వెలుగు మూలమును ధారణచేసి, ధ్యానించి ఆత్మగ తనను తాను తెలియుట ఈ మొత్తము సాధన.

క్రమము నంతయు విపులముగ, విశిష్టముగ దైవ మెరిగించినాడు. కావున ఈ ఆరు అధ్యాయములను సాధన షట్కమని పేర్కొనిరి. ఆచరించి తరించుటకు భగవద్గీతకన్న మించిన గ్రంథము ప్రపంచములో లేదు. ఇది ముమ్మాటికిని సత్యము. పాఠకులు గ్రహించి, ధీరతతో ఆచరించి తరింతురు గాక!

శ్రీమద్భగవద్గీత యందలి 6వ అధ్యాయము 'ధ్యాన యోగ' వివరణము సంపూర్ణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


07 Jun 2021

No comments:

Post a Comment