శ్రీ శివ మహా పురాణము - 409


🌹 . శ్రీ శివ మహా పురాణము - 409🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 22

🌻. పార్వతీ తపోవర్ణనము - 5 🌻

ఈ విధముగా ఆ కాళీ మహేశ్వరుని ధ్యానిస్తూ తపోవనములో తపస్సును చేయుచుండగా మూడువేల సంవత్సరములు గడచిపోయినవి (52). ఏ స్థానములో శివుడు అరవై వేల సంవత్సరములు తపస్సును చేసెనో, అదే స్థానమునందు ఆ పార్వతి కొంతసేపు కూర్చుండి ఇట్లు తలపోసెను (53).

ఓ మహాదేవా! నేను చిరకాలము నుండియు తపస్సును చేయుచున్ననూ నీవు నన్ను అనుగ్రహించ లేదు. నేనీ నియమములో ఉన్నాను అను విషయము నీకు ఇంత వరకు తెలియదా యేమి (54) లోకములోని భక్తులు, వేదములు మరియు మహర్షులు శంకరుడు, కైలాసగిరివాసి సర్వజ్ఞుడనియు, సర్వుల ఆత్మరూపుడనియు, సర్వసాక్షి అనియూ సర్వదా కీర్తించుచుందురు (55).

ఆ దేవుడు సర్వ సంపదలనిచ్చువాడు, అందరి మనస్సులోని భావముల నెరుంగువాడు, నిత్యము భక్తుల కోర్కెలనీడేర్చి క్లేశములనన్నిటినీ తొలగించువాడు (56). నేను కోర్కెలనన్నిటినీ విడిచి పెట్టి శివుని యందు అనురాగము కలిగియున్న దాననైనచో వృషభధ్వజుడగు ఆ శంకరుడు నన్ను అనుగ్రహించుగాక! (57)

నారదుడు ఉపదేశించిన పంచాక్షరీ మంత్రమును నేను తంత్ర పూర్వకముగా చక్కని భక్తితో యథావిధిగా ప్రతిదినము జపించి యున్నచో, శంకరుడు ప్రసన్నుడగుగాక! (58) నేను సర్వేశ్వరుడగు శివుని భక్తితో వికారములు లేనిదాననై యథావిధిగా ఆరాధించి యున్నచో, శంకరుడు ప్రసన్నుడగు గాక! (59) ఆమె తలను వంచుకొని, వికారములు లేనిదై జటలను నారబట్టలను ధరించి ఇట్లు నిత్యము తలపోయిచూ చిరకాలము తపస్సును చేసెను (60).

ఆమె ఆ విధముగా మునులకు కూడ చేయ శక్యము గాని తపస్సును చేసెను. అచటి వ్యక్తులు ఆమె తపస్సు గుర్తుకు వచ్చినపుడు గొప్ప ఆశ్చర్యమును పొందెడివారు (61) వారందరు ఆమె తపస్సును చూచుటకి వచ్చి తాము ధన్యులమైతిమని తలపోయుచూ పరస్పరము ఆమె తపస్సును గురించి చర్చించుకొనెడివారు. ఆమె తపోమహిమ విషయములో వారికి ఒకే అభిప్రాయముండెడిది (62).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


07 Jun 2021

No comments:

Post a Comment