గీతోపనిషత్తు -213


🌹. గీతోపనిషత్తు -213 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 4 - 2

🍀 3 - 2. యజ్ఞము - పురుషుడు మారుతున్న ప్రకృతితో కూడి తన నిజస్థితి కోల్పోయి నపుడు జీవుడుగ భ్రమపడు చున్నాడు. నాటకమున నటుడు తనను తాను మరిచి, నాటకపాత్రయే తానని భ్రమ చెందునట్లు, సహజముగ దైవమగు పురుషుడు జీవుడుగ భ్రమ చెందును. నిజముగ అష్టప్రకృతులను అధిష్ఠించి పురమున నున్న పురుషుడు దేవుడే కాని జీవుడు కాదు. అతడే అధిభూతము. పురమందున్న పురుషుడే దైవము. పురములు లేక యున్నపుడు ఆత్మ. పురము లందున్నపుడు పురుషుడు. సమాధియందు బ్రహ్మము. 🍀

అధిభూతం క్షరోభావః పురుషశ్చాధి దైవతమ్ |
అధియజో హమేవాత్ర దేహే దేహభృతాం వర || 4


తాత్పర్యము :

స్వభావము నుండి ప్రకృతి పుట్టుచున్నది. ఈ ప్రకృతి క్షరము. స్వభావము నధిష్టించి అధిదైవతముగ పురుషుడున్నాడు. అట్టి పురుషుడు నిర్వర్తించునది యజ్ఞము.

ఇట్లు అధిభూతము, అధియజ్ఞము, కర్మము, అధిదైవము, ఆధ్యాత్మముగ బ్రహ్మ స్వభావ మేర్పడుచు నుండును. కనుక నంతయు బ్రహ్మ సంబంధమే. బ్రహ్మ మాధారముగనే స్వభావము ఆత్మయగుట, అష్ట ప్రకృతులుగ నేర్పరచుట, సృష్టి కర్మమును యజ్ఞమును నిర్వర్తించుట, ఈ మొత్తము నందు తాను ప్రవేశించి వ్యాప్తి చెంది యుండుట శ్రద్ధా భక్తులతో గమనించినచో, అక్షరము పరము అగు బ్రహ్మము నుండి ఉత్పన్నమగు స్వభావము ద్వారా బ్రహ్మమెట్లు వ్యాప్తి చెంది యున్నాడో తెలియును.

కర్మము, యజ్ఞము, అష్ట ప్రకృతులు (అధిభూతములు), పురుషుడు, దైవము, ఆత్మ, పరము అను అంశములను ఇట్లు సంగ్రహముగ శ్రీకృష్ణు డుపదేశించి యున్నాడు. అధిభూతములు క్షరములు. అనగా నశించును. మార్పు చెందును. ప్రకృతి ఏర్పాటు చేయు రూపము లన్నియు మార్పు చెందును. కాని వానియందు వశించు పురుషుడు నశించడు.

పురుషుడు మారుతున్న ప్రకృతితో కూడి తన నిజస్థితి కోల్పోయి నపుడు జీవుడుగ భ్రమపడు చున్నాడు. నాటకమున నటుడు తనను తాను మరిచి, నాటకపాత్రయే తానని భ్రమ చెందునట్లు, సహజముగ దైవమగు పురుషుడు జీవుడుగ భ్రమ చెందును. నిజముగ అష్టప్రకృతులను అధిష్ఠించి పురమున నున్న పురుషుడు దేవుడే కాని జీవుడు కాదు. అతడే అధిభూతము. అనగా ఎనిమిది ప్రకృతులను అధిష్ఠించి యున్నాడు. అతడే పురుషుడు. అనగా ప్రకృతి పురములందున్నాడు.

పురమందున్న పురుషుడే దైవము. పురములు లేక యున్నపుడు ఆత్మ. పురము లందున్నపుడు పురుషుడు. సమాధియందు బ్రహ్మము. ఈ సత్యము దర్శనమిచ్చుటకు కర్మము యజ్ఞముగ మారవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Jun 2021

No comments:

Post a Comment