శ్రీ శివ మహా పురాణము - 413


🌹 . శ్రీ శివ మహా పురాణము - 413🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 23

🌻. దేవతలు శివుని దర్శించుట - 3 🌻


సర్వావయవముల యందు తాపమును పొందిన ఇంద్రాది దేవతలందరు కంగారును పొంది ఒకచో గూడి బృహస్పతిని పిలిచి సుమేరు పర్వతమునందున్న బ్రహ్మను (నన్ను) శరణు జొచ్చిరి (22). వారందరు నష్టమైన కాంతిగలవారై కంగారు పడుతూ అచటకు చేరి నన్ను స్తుతించి ముక్త కంఠముతో నిట్లనిరి (23).

దేవతలిట్లు పలకిరి -

ఈ స్థావర జంగమాత్మకమగు జగత్తంతయూ నీచే సృష్టింపబడినది. హే విభో! ఇపుడీ జగత్తు గొప్ప తాపమును పొందియున్నది. కారణము తెలియుట లేదు (24). హే ప్రభో! బ్రహ్మా! అట్లు జరుగుటకు గల కారణము నీకు తెలియును. దానిని మాకు చెప్పుము. నల్లగా మాడిపోయిన దేహములు గల దేవతలను రక్షించ గలవాడు నీవు తక్క మరియొకడు గానరాడు (25).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఈ మాటలనాలకించి నేను మనస్సులో శివుని స్మరించి, అదంతా పార్వతి యొక్క తపః ప్రభావమేనని మనస్సులో నిశ్చయించుకొంటిని (26). జగత్తు దహింప బడుచున్నది యని తెలుసుకొని, నేను వారందరితో కలిసి, విష్ణువునకు ఆదరముతో ఆ వృత్తాంతమును చెప్పుట కొరకై, వెంటనే పాలసముద్రము వద్దకు వెళ్లితిని (27).

అచటకు వెళ్లి, సుఖమగు ఆసనము నందు కులాసాగా ఉన్న విష్ణువును చూచి, దేవతలతో సహా చేతులు జోడించి నమస్కరించి స్తుతించి ఇట్లు పలికితిని (28). హే మహావిష్ణో! రక్షింపుము, రక్షింపుము. మేము తాపపీడితులమై నిన్ను శరణు పొందినాము. పార్వతి చేయుచున్న పరమోగ్ర తపస్సు మమ్ములను దహించుచున్నది (29). దేవతలతో గూడియున్న నా ఈ మాటలను విని శేషశయ్యపై కూర్చుండియున్న లక్ష్మీపతి మాతో నిట్లనెను (30).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Jun 2021

No comments:

Post a Comment