శ్రీ శివ మహా పురాణము - 412
🌹 . శ్రీ శివ మహా పురాణము - 412🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 23
🌻. దేవతలు శివుని దర్శించుట - 2 🌻
పార్వతి ఇట్లు పలికెను-
తండ్రీ! పూర్వము మీకు చెప్పియుంటిని. తల్లీ! నీవు మరచితివా యేమి! బంధులారా! ఇప్పుడైననూ నా ప్రతిజ్ఞను వినుడు (11). ఈ మహాదేవుడు విరాగి. ఆయన కోపించి మన్మథుని భస్మము చేసినాడు. భక్త వత్సలుడగు అట్టి శంకరుని తపస్సు చేసి సంతోషపెట్టెదను (12). మీరందరూ ఆనందముగా మీ మీ గృహములకు వెళ్లుడు. శివుడు తప్పక ప్రసన్నుడు కాగలడు. ఈ విషయములో చర్చను చేయ తగదు (13). ఏ శివుడు మన్మథుని, హిమవంతుని వనమును తగులబెట్టినాడో, అట్టి శివుని కేవలము తపః ప్రభావముచే ఇదే స్థానమునకు తీసుకొని వచ్చెదను (14).
గొప్ప తపస్సు యొక్క బలముచే సదాశివుని సులభముగా సేవించవచ్చును. మహాత్ములారా! మీకు నేను ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను. తెలియుడు (15). చక్కగా మాటలాడునది, పరమేశ్వరి యగు పార్వతి మేనకను, అన్నగారు అగు మైనాకుని, మందరుని, తండ్రియగు హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికి మిన్నకుండెను (16). పార్వతి ఇట్లు పలుకగా, మేరుపు మొదలగు విద్వాంసులైన ఆ పర్వత రాజులు విస్మితులై పార్వతిని అనేక విధముల కొనియాడుచూ వచ్చిన దారిని వెళ్లిరి (17).
వారందరు వెళ్లగానే సఖురాండ్రతో గూడియున్న పార్వతి శివదర్శనమునే పరమ లక్ష్యమునందు దృఢమైన చిత్తము గలదై, అంతకంటె అధికమగు తపస్సును చేసెను (18). ఓ మునిశ్రేష్ఠా! స్థావర జంగమములతో, దేవరాక్షసులతో, మానవులతో కూడియున్న ముల్లోకములు ఆ గొప్ప తపస్సుచే తాపమును పొందెను (19). అపుడు దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, చారణులు, సిద్ధులు, సాద్యులు, మునులు, విద్యాధరులు, నాగులు (20), ప్రజాపతులు, గుహ్యకులు మరియు ఇతరులు అందరు తీవ్రమగు కష్టమును పొందిరి. కాని దాని కారణమును వారెరుగరైరి (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
14 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment