గీతోపనిషత్తు -233
🌹. గీతోపనిషత్తు -233 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 16-2
🍀 15-2. సత్యము - ధర్మము - పుణ్యములను నిర్వర్తించి పుణ్యలోకములు చేరుట, పాపములను నిర్వర్తించి పాపలోకములు చేరుట కర్మ ఆధారముగ జరుగును. జన్మకు కర్మ కారణము. పుణ్యకర్మ మిగిలియున్నచో పుణ్య జన్మము, పాపకర్మ నిర్వర్తించినచో పాపజన్మము. ఫలాసక్తిలేని కర్తవ్యము నాచరించినపుడు సంచితమైన కర్మ యంతయు క్రమముగ నశించును. కనుక జన్మకు కారణము నశించును. అట్టి కర్తవ్యమందు నిమగ్నుడై ఈ అధ్యాయమున ముందు శ్లోకములలో తెలిపిన విధముగ నాదము నాశ్రయించి పరమును చేరినచో, అట్టివానికి పునర్జన్మ యుండదు. 🍀
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోబర్జున |
మా ముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే || 16
తాత్పర్యము : చతుర్ముఖ బ్రహ్మ సృష్టియందలి అన్ని లోకములందు మరల మరల జన్మలెత్తు లక్షణమున్నది. నన్ను చేరిన వారికి మరల జన్మయే లేదు.
గుడ్డి, మూగ, చెముడు, అవిటితనము, అంగవైకల్యము, నిరంతర దుఃఖము పూర్వజన్మయందు చేసిన కృత్యములుగనే శాస్త్రములు తెలుపుచున్నవి. భగవంతుని సృష్టియందు సత్యము, ధర్మము నాణెమునకు ఇరుముఖముల వంటివి. వీనిని పాటించుచు ఉత్తమ లోకములు చేరవచ్చును. వీనిని విస్మరించినపుడు అధోలోకములు చేరుట యుండును. ఈ ఏడు లోకము లందు పునర్జన్మ ప్రాప్తి యున్నది.
పుణ్యములను నిర్వర్తించి పుణ్యలోకములు చేరుట, పాపములను నిర్వర్తించి పాపలోకములు చేరుట కర్మ ఆధారముగ జరుగును. జన్మకు కర్మ కారణము. పుణ్యకర్మ మిగిలియున్నచో పుణ్య జన్మము, పాపకర్మ నిర్వర్తించినచో పాపజన్మము. ఇట్లు పుణ్యము వలనను జన్మలు కలుగుచుండును. పాపముల వలనను జన్మలు కలుగుచుండును. కనుక బ్రహ్మదేవుని సృష్టిలో జన్మకర్మలు తప్పని సరియై యుండును.
ఇందుండి బయల్పడుటకు ఉపాయమును భగవానుడు బోధించుచున్నాడు. అది ఈ క్రింది విధముగ నున్నది. ఫలాసక్తిలేని కర్తవ్యము నాచరించినపుడు సంచితమైన కర్మ యంతయు క్రమముగ నశించును. కనుక జన్మకు కారణము నశించును. అట్టి కర్తవ్యమందు నిమగ్నుడై ఈ అధ్యాయమున ముందు శ్లోకములలో తెలిపిన విధముగ నాదము నాశ్రయించి పరమును చేరినచో, అట్టివానికి పునర్జన్మ యుండదు.
కర్మ రహితమగుటచే, జన్మలు రహితమగును. బ్రహ్మోపాసన మార్గము అవలంబించుటచే బ్రహ్మదేవునికి పరమైన పదమును చేరును. అదియే పరమపదము. అది శాశ్వతమైనది. సృష్టికతీతమైన స్థితి. అది ఆధారముగనే సృష్టి ఏర్పడుచుండును. భగవంతుడు తెలిపిన ఉపాయము వలన జీవుడు సృష్టిచక్రము నుండి విడుదలై, దానిని దర్శించు స్థితియందుండును. దైవ సంకల్పముగ మరల సృష్టి లోనికి దిగివచ్చినను, చక్రగతి వారిని అంటదు. అట్టివారే బ్రహ్మర్షులు. వారు ముక్తులు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
29 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment