✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 25
🍀 24. పునరావృత్తి మార్గము 🍀
ధూమో రాత్రి స్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతి ర్యోగ ప్రాప్య వివర్తతే || 25
తాత్పర్యము : పొగ, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము పునరావృత్తి మార్గములు సూచించు సంకేతములు. ఈ కాలములో మరణించిన యోగులు చంద్ర సంబంధము కలిగి మరలి వచ్చు చున్నారు.
వివరణము : జ్యోతి ఎంతటి స్పష్టతను తను దృష్టికి కలిగించునో, ధూమము (పొగ) అంత అస్పష్టత కలిగించును. అట్లే పగలు సూర్యకాంతి యందు దర్శనము అతి స్పష్టము. కాని రాత్రియందు దర్శనము కన్నులకు మిక్కిలి అస్పష్టము. అట్లే శుక్లపక్షము ప్రజ్ఞకు ఎట్లు క్రమబద్ధమగు వికాసము కలిగించునో కృష్ణపక్షము ఉన్న వికాసమును క్రమముగ తగ్గించు చుండును. ఉత్తరాయణము ఆరు నెలలు ప్రజ్ఞకు ఊర్ధ్వగతి ఎట్లు కలిగించునో దక్షిణాయనము ప్రజ్ఞకు అవరోహణ గతిని కలిగించును. ఇరువది నాల్గవ (24) శ్లోకమున ఊర్ధ్వగతికి అనుగుణమగు సమయములు తెలుపబడినవి. ఈ శ్లోకమున ఊర్ధ్వగతి నుండి అవరోహణ క్రమమున భూమికి చేరువగు సమయములు తెలుప బడుచున్నవి. జీవులకు ఊర్ధ్వగతి వలన ఉత్తమ సంస్కారములు, ఉత్తమ జ్ఞానము, ఉత్తమ సంకల్పములు సంక్రమించును. బ్రహ్మ వేత్తలకు బ్రహ్మము చేరుటకు కూడ ఈ సమయము లనుకూలమై యున్నవి.
ముందు శ్లోకమున బ్రహ్మవేత్తల ప్రయాణము గూర్చి భగవంతుడు వివరించినాడు. ఈ శ్లోకమున యోగులను గూర్చి ప్రస్తా వించినాడు. బ్రహ్మోపాసనము గావించి, బ్రహ్మమును చేరుట ఆశయముగ బ్రహ్మవిదులు ప్రయత్నించుచు నుందురు. బ్రహ్మ మును చేరి, బ్రహ్మమున స్థిర నివాస మేర్పరచుకొనుట వారి అభిమతము. వారు బ్రహ్మ సంకల్పముగ సృష్టిలోనికి దిగివత్తురు. యోగులు అష్టాంగ యోగ విధానమున సమాధి స్థితిని చేరి సర్వ సమన్వయము చెంది, లోకహితమునకై లోకముల యందు చరించుట కుత్సహింతురు. దివ్య సంకల్పము ననుసరించి, లోక హిత మొనర్చుచు, చిరకాలము భూలోకము నందే యుందురు.
ఇట్టి వారిని చిరంజీవు లందురు. వీరు సర్వము నెరిగియు లోక హితము కొరకై దిగివచ్చుచు నుందురు. అట్టి వారికి ఈ శ్లోకమున చెప్పబడిన సమయములు అనుకూలమని భగవానుడు తెలుపు చున్నాడు. యోగులు అన్నిలోకము లందలి అంతర్యామి తత్త్వముతో ముడిపడి యుందురు గనుక, వారు ఊర్ధ్వము అధస్సు అను వ్యత్యాసములు దాటి అంతటా నిండియున్న అంతర్యామితో కూడి యుండి భగవత్ సంకల్పము నెరవేర్చుచు, సృష్టియందు శాశ్వతులై యుందురు. యోగులకు ఉన్నతము, నిమ్నము అను భావము లుండవు. వారు సమవర్తనులు, సమదర్శనులు. భగవానునికి ఇట్టివా రెక్కువ ప్రీతిపాత్రులు. “యోగీభవ అర్జునా" అని తనకు ప్రియుడగు అర్జునుని యోగిగ నుండుమని సంకేతించెను.
బ్రహ్మజ్ఞానులు భగవంతునికి ప్రియులు. యోగులు భగవంతునికి వాహికలు. కనుక ఇరువురకును అనుకూలమగు ప్రయాణ సమయములు తెలుపబడినవి. ఇందొక దానికన్న మరియొకటి గొప్పదని భావించుట అవివేకము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
30 Aug 2021
No comments:
Post a Comment