🌹 . శ్రీ శివ మహా పురాణము - 446🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 29
🌻. శివపార్వతుల సంవాదము - 4 🌻
పరమాత్మ, పరబ్రహ్మ నీవే. నిర్గుణుడవగు నీవు ప్రకృతికి అతీతుడవు. నీవు వికారములు, కామనలు లేని స్వతంత్ర పరమేశ్వరుడవు (33).అయిననూ నీవు సగుణుడవై భక్తులను ఉద్ధరించుట ప్రధానలక్ష్యముగా కలిగి విహరించు చున్నావు. అనేక లీలలను ప్రదర్శించుటలో పండితుడవగు నీవు ఆత్మనిష్ఠుడవై ఉండెదవు (34). ఓ మహాదేవా! మహేశ్వరా! నిన్ను నేను పూర్తిగా ఎరుంగుదును. పెక్కు మాటలేల? నీవు సర్వజ్ఞుడవు. దయను చూపుము (35). గొప్ప అద్భుతమగు లీలను ప్రదర్శించి లోకములో కీర్తిని విస్తరిల్ల జేయుము. నాథా! ఆ కీర్తిని చక్కగా గానము చేయు జనులు శీఘ్రమే సంసారసముద్రము నుండి ఉత్తీర్ణులగుదురు (36).
బ్రహ్మ ఇట్లు పలికెను-
పార్వతి ఇట్లు పలికి అనేక పర్యాయము తలవంచి చేతులు ఒగ్గి మహేశ్వరునకు నమస్కరించి మిన్నకుండెను (37). ఆమె ఇట్లు పలుకగా మహాత్ముడగు ఆ మహేశ్వరుడు లోకపు తీరును అనుకరించుట కొరకై అటులనే చేసెదనని తలంచి, నవ్వుతూ ఆనందించెను (38). అపుడు మిక్కిలి ఆనందించిన శంభుడు అంతర్ధానమును చెంది కాలి యొక్క విరహముచే పీడితమైన మనస్సు గలవాడై కైలాసమును చేరుకొనెను (39).
అచటకు వెళ్లి పరమానందముతో నిండియున్న మహేశ్వరుడు ఆ వృత్తాంతమునంతనూ నంది మొదలగు వారికి చెప్పెను (40). భైరవాది గణములన్నియూ ఆ వృత్తాంతమును వని మిక్కిలి ఆనందించిన వారై మహోత్సవమును జరుపుకొనిరి (41). ఓ నారదా! ద్విజా! అచట గొప్ప మంగళము ప్రవర్తిల్లెను. అందరికీ దుఃఖము తొలగిపోయెను. రుద్రుడు కూడ మహానందమును పొందెను (42).
శ్రీ శివ మహాపురాణములో ఉరుద్రసంహితయందు పార్వతీ ఖండలో శివాశివ సంవాదమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
30 Aug 2021
No comments:
Post a Comment