శ్రీ శివ మహా పురాణము - 435


🌹 . శ్రీ శివ మహా పురాణము - 435🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 27

🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 1 🌻


పార్వతి ఇట్లుపలికెను-

ఓ బ్రాహ్మణాశ్రేష్టా! బ్రహ్మచారీ! నా వృత్తాంతము నంతనూ వినుము నా సఖి ఇప్పుడు చెప్పిన వచనములు సత్యమే గాని మరియొకటి గాదు(1) నేను మనస్సుచే సత్యమును సంకల్పించి, వాక్కుచే సత్యమును పలికి కర్మచే సత్యము ననుష్టించెదను. అసత్యము పలుకను. నేను శంకరుని భర్తగా వరించితిని(2). దుర్లభమగు వస్తువును నేను ఎట్లు పొందదగును? ఈ విషయమును నేను ఎరుంగుదును. అయిననూ మనస్సునందు ఉత్సాహముండుటచే నేనీనాడు తపస్సును చేయుచున్నాను.(3)

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడా పార్వతి ఆ బ్రహ్మచారితో నిట్లు పలికి మిన్నకుండెను పార్వతి యొక్క ఆ మాటలను విని ఆ బ్రాహ్మనుడిట్లు పలికెను(4).

బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఈ దేవి ఏ వస్తువును గోరి తీవ్రమగు తపస్సును చేయుచున్నదో తెలియవలెనని నాకు ఇంతకాలము నుండియు కోరిక గలదు(5). ఓ దేవీ! ఇపుడా వృత్తాంతమునంతనూ నీ పద్మములవంటి ముఖము నుండి వినియుంటిని. ఇపుడీ స్థానము నుండి నేను వెళ్ళిపోవుచున్నాను. నీకు తోచినట్లు చేయుము.(6) నీవు నాకు చెప్పనిచో స్నేహభావము వ్యర్థమయ్యెడిది. నీవు ఎట్లు ప్రవర్తించెదవో, నీ భవిష్యత్తు అటులనే నిర్మాణమగును. నీకు దీని యందే సుఖము ఉన్నచో, చెప్పవలసినది ఏమియూ లేదు(7).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికిన ఆ బ్రహ్మచారి బయలుదేరుటకు సిద్దపడుచుండెను. ఇంతలో పార్వతీదేవి ఆ బ్రాహ్మణునకు నమస్కరించి ఇట్లు పలికెను.(8)

పార్వతి ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణా శ్రేష్టా! ఏల వెళ్ళి పోవుచున్నావు? ఉండుము. నాకు హితమును భోధించుము. ఆమె ఇట్లు పలుకగా దండమును ధరించి యున్న భ్రాహ్మణుడు నిలబడి ఇట్లు పలికెను.(9).

బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఓ దేవీ! నేను వెళ్లకుండగా భక్తి పూర్వకముగా ఆపివేయుచున్నావు. నా మాటను వినగోరుచున్నావా? అట్లైనచో నీకు జ్ఞానమును కలిగించే సత్యమున్నంతనూ చెప్పెదను(10). నేను మహాదేవుని బాగుగా ఎరుంగుదును. నేను నీకు గురువు యొక్క ధర్మము ననుసరించి సత్యము చెప్పుచున్నాను. శ్రద్ధగా వినుము (11)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


05 Aug 2021

No comments:

Post a Comment