శ్రీ శివ మహా పురాణము - 443


🌹 . శ్రీ శివ మహా పురాణము - 443🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 29

🌻. శివపార్వతుల సంవాదము - 1 🌻


నారదుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! విధీ! మహాత్మా! తరువాత ఏమైనది? పవిత్రమగు ఆ వృత్తాంతమునంతనూ వినగోరుచున్నాను. నీవు శివాదేవి యొక్క కీర్తిని గురించి చెప్పుము (1).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నేనీగాథను ఆనందముతో చెప్పెదను. నీవు చక్కగా వినుము. ఈ గాథ మహాపాపములను పొగొట్టి శివభక్తిని వర్ధిల్లజేయును (2). పరమాత్మ యగు శివుని మాటను విని, ఆనందదాయకమగు ఆయన రూపమును చూచి, పార్వతి చాల సంతసిల్లెను. ఓ బ్రాహ్మాణా! (3) మహాపతివ్రత, మిక్కిలి ఆనందముతో నున్నది, ప్రీతిచే వికసించిన నేత్రములు గలది అగు శివాదేవి తన సమీపమునందున్న శివవిభునకు ఇట్లు బదులిడెను (4).

పార్వతి ఇట్లు పలికెను -

ఓ దేవదేవా! నీవు నా నాథడవు. నీవు నా కోసమై ఆగ్రహించి దక్షయజ్ఞమును ధ్వంసమొనర్చితివి. ఆ పూర్వగాథను మరచితివాయేమి? (5)

ఓ దేవదేవా! ఈశ్వరా! అట్టి నేను తారకునిచే పీడింపబడిన దేవతల కార్యము సిద్ధించుట కొరకై మేనయందు జన్మించితిని (6). ఓ దేవ దేవా! ఈశానా! ప్రభూ! నీవు ప్రసన్నుడవైనచో, నీకు దయ కలిగినచో, నా మాటను పాలించి నా భర్తవు కమ్ము (7). నీ అనుజ్ఞను పొంది నేను మా తండ్రిగారి ఇంటికి వెళ్లెదను. నీ పరమపవిత్రమగు కీర్తి నలుదిక్కులా వ్యాపించునట్లు చేయుము (8).

హే నాథా! ప్రభూ! నీవు హిమవంతుని వద్దకు వెళ్లవలెను. లీలాపండితుడవగు నీవు భిక్షుకుడవై ఆతని నుండి నన్ను కోరుము (9). అట్లు నీవు చేసి నీ కీర్తిని లోకములో విస్తరిల్ల జేయుము. మరియు నా తండ్రియొక్క గృహస్థాశ్రమమును సఫలము చేయుము (10).

మహర్షులచే బోధింపబడినవాడై నా తండ్రి బంధువులతో గూడి ప్రీతియుక్తముగా నీకోర్కెను మన్నించగలడు. ఈ విషయములో సందేహము వలదు (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


23 Aug 2021

No comments:

Post a Comment