శ్రీ శివ మహా పురాణము - 448


🌹 . శ్రీ శివ మహా పురాణము - 448🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 30

🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 2 🌻

తరువాత ఆమెకు బంధువులగు ఇతరస్త్రీలు, సోదరుల భార్యలు గూడ మహానందముతో పరమప్రీతితో ఆమెను గట్టిగా కౌగిలించుకొనిరి (15). నీవు వంశమును తరింపజేయు పుణ్యకార్యమును చక్కగా సాధించితివి. నీ పవిత్రమగు ఆచరణచే మేమందరము కూడా పవిత్రులమైతిమి (16). ఇట్లు వారందరు మహాహర్షముతో ఆమెను బాగుగా కొనియాడి, సుగంధ ద్రవ్యములతో, మరియు మంచి పుష్పములతో ఆ శివాదేవిని ఉల్లాసముగా చక్కగా పూజించిరి (17). ఆ సమయములో ఆకసమునందు విమానములలో నున్న దేవతలు ఆనందముతో మంగళకరమగు పుష్పవృష్టిని గురిపించి ఆమెకు నమస్కరించి స్తోత్రములను చేసిరి (18).

అపుడు బ్రాహ్మణులు మొదలగువారందరు ఆనందముతో ఆమెను ప్రకాశించే గొప్ప రథములో కూర్చుండబెట్టి నగరములో ప్రవేశబెట్టిరి (19). అపుడు బ్రాహ్మణులు, పురోహితుడు, చెలికత్తెలు మరియు ఇతర స్త్రీలు పార్వతిని సన్మాన పూర్వకముగా ఇంటిలో ప్రవేశపెట్టిరి (20). స్త్రీలు ఆమెకు దిష్టి తీసిరి. బ్రాహ్మణులు ఆశీర్వచనములను పలికిరి. ఓ మహర్షీ! తల్లిదండ్రులగు మేనా హిమవంతులు మిక్కలి ఆనందించరి (21). తన గృహస్థాశ్రమము సఫలమైనదనియు, చెడు పుత్రునికంటె పుత్రికయే శ్రేష్ఠమనియు భావించిన హిమవంతుడు నిన్ను (నారదుని)'బాగు, బాగు' అని స్తుతించెను (22).

ఆ పర్వతరాజు బ్రాహ్మణులకు, వందిమాగధులకు ధనము నిచ్చెను. బ్రాహ్మణులచే మంగళ పాఠములను చదివించెను. గొప్ప ఉత్సవమును చేయించెను (23). ఓ మహర్షీ! ఈ తీరున తమ కుమార్తెచే సంతసించిన తల్లిదండ్రులు, సోదరులు మరియు వారి భార్యలు మహానందముతో వాకిట గూర్చిండిరి (24).

ఓ కుమారా! తరువాత మిక్కిలి ఆనందించి, ప్రసన్నమగు మనస్సును కలిగియున్న ఆ హిమవంతుడు అందరిని ప్రీతి పూర్వకముగా ఆదరించి స్నానము చేయుటకు గంగానదికి వెళ్లెను (25). ఇంతలో భక్తవల్సలుడు, లీలలను చూపువాడు నగు శంభుడు నాట్యము చేసే నటుని రూపమును ధరించి మేనాదేవి వద్దకు వెళ్లెను (26).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


04 Sep 2021

No comments:

Post a Comment