గీతోపనిషత్తు -249


🌹. గీతోపనిషత్తు -249 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 27

🍀 26. యోగ యుక్తుడు - జీవుడు దేవునితో కూడి యుండుట దైవయోగము. అట్లు దైవముతో కూడియున్నవాడు ఎందున్నను ఒక్కటియే. అతడెచ్చట యున్నను, అచట దైవముతోనే యుండును గనుక, దైవమును చేరుట అను భ్రమ యుండదు. విడిపోయిన వాడు చేరు ప్రయత్నము చేయవలెను. కూడియున్న వాడు అట్లుండుటయే గాని చేయుట యుండదు. అట్టి వానినుండి దైవీగుణములగు ఇచ్ఛా జ్ఞాన క్రియలు ప్రకాశించుచునే యుండును. అట్టి వానినుండి దివ్య కార్యములు జరుగుచు నుండును. జరుగుచున్నది చూచుచు, దివ్య వైభవమున కానందించుటయే గాని, తాను చేయుచున్నాననే మెర మెర జ్ఞానికి యుండదు. తాను దైవమందుండుట వలన తన నుండి నిర్వర్తింపబడ వలసిన కార్యములు దైవ ప్రకృతే నిర్వర్తించును. 🍀



నైతే సృతి పార్థ జాన న్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున || 27

తాత్పర్యము : జ్ఞానయోగి శుక్ల కృష్ణ మార్గముల యందు మోహపడడు. కనుక ఓ అర్జునా! నీవు యోగయుక్తుడవు కమ్ము.

వివరణము : యోగయుక్తు డనగా సర్వకాల సర్వావస్థల యందును దైవముతో కూడియున్న వాడని అర్థము. యోగమనగా కూడిక. పతి, పత్నియోగము, సంతానయోగము, ధనయోగము,

అట్లే వియోగము అను పదములను వినుచుందుము. కూడి యుండుట యోగము లేక భక్తి. విడిపోవుట వియోగము లేక విభక్తి.

జీవుడు దేవునితో కూడి యుండుట దైవయోగము. అట్లు దైవముతో కూడియున్నవాడు ఎందున్నను ఒక్కటియే. అతడెచ్చట యున్నను, అచట దైవముతోనే యుండును గనుక, దైవమును చేరుట అను భ్రమ యుండదు. విడిపోయిన వాడు చేరు ప్రయత్నము చేయవలెను. కూడియున్నవాడు అట్లుండుటయే గాని చేయుట యుండదు. అట్టి వానినుండి దైవీగుణములగు ఇచ్ఛా జ్ఞాన క్రియలు ప్రకాశించుచునే యుండును. అట్టి వానినుండి దివ్య కార్యములు జరుగుచు నుండును. జరుగుచున్నది చూచుచు, దివ్య వైభవమున కానందించుటయే గాని, తాను చేయుచున్నాననే మెర మెర జ్ఞానికి యుండదు.

అట్టి జ్ఞానయోగికి ఇహమైనను, పరమైనను ఒకటే. ఏ జాతి యందు జన్మించినను ఒకటే. ఏ కులమందు జన్మించిననూ ఒకటే. ఏ లోకమందున్నను ఒకటే. అట్టి వానికి ఎక్కువ తక్కువలు గాని, జ్ఞానాజ్ఞానములు గాని భేదముండదు. తాను దైవమందుండుట వలన తన నుండి నిర్వర్తింపబడ వలసిన కార్యములు దైవ ప్రకృతే నిర్వర్తించును. కనుకనే జ్ఞానియగు భక్తునికి, యోగికి మోహ ముండు అవకాశమే లేదు. అతడు సర్వకాలము లందు, సర్వ దేశములందు దైవముతో కూడియుండుట వలన మాయ చేరనేరదు. కనుక మోహము కలుగదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


04 Sep 2021

No comments:

Post a Comment