మైత్రేయ మహర్షి బోధనలు - 27
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 27 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 17. ఒక రహస్యము 🌻
ఈ మధ్యకాలమున ప్రపంచమున వేలాది సోదరబృందము లేర్పడినవి. ఈ బృందములన్నిటి యందును సోదరత్వము మాత్రమే కొలత. నామమాత్రపు సోదరత్వమే కాని అందు మూలసూత్రములు కానరావు. సోదరత్వమునకు విశ్వాసము పునాదిరాయి. ఒకరిపై ఒకరికి అపనమ్మకము, అనుమానము, సందేహము, అసంతృప్తి కలిగి బృందము మాత్రము గోచరించుచు నామావశిష్టములుగ ఈ బృందములు మిగిలివున్నవి. ఒకరి నొకరు "సోదరా” అని సంబోధింతురే కానీ హృదయమున సోదరత్వముండదు. భావశూన్యమైన ఉత్తమ పదజాలములతో ఒకరి నొకరు పొగడుకొనుచు ఎవరి కార్యములు వారు నెగ్గించుకొనుటకు ప్రయత్నించు చుందురు. ధర్మసంస్థల యందు ధర్మమే' కొఱత. సహకార సంఘముల యందు 'సహకారమే' కొలత. సేవాసంస్థల యందు 'సేవయే' కొలత.
ఆధ్యాత్మిక సంస్థల యందు 'ఆత్మజ్ఞానమే' కొలత. పదజాలము ఇంద్రజాలమువలె వికృతముగ నాట్యము చేయుచున్నది. ఇట్టి కలుషిత వాతావరణమున గుహ్యముగ విశ్వమానవ సోదరత్వమునకు సంకల్ప బీజములు నిశ్శబ్దముగ చల్లుట నా కర్తవ్యము. ఈ బీజములు మొలకెత్తి ఉద్యానవనములై భవిష్యత్తు నందు సత్ఫలములీయ గలవని నా విశ్వాసము. ధర్మముపై పూర్ణ విశ్వాసము కలవారెల్లరును ఈ ఉద్యానవనమును క్రమముగా చేరగలరు. సమస్త ధర్మములను అతిక్రమించుచు భౌతిక వాదములు చెలరేగుచున్న ఈ సమయమున ధర్మము రహస్యముగ నూతన పునాదులను ఏర్పరచుకొనుచున్నది.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment