మైత్రేయ మహర్షి బోధనలు - 36


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 36 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 25. ఉట్టి - స్వర్గము 🌻

జాతి పునర్నిర్మాణమునకు పూనుకొనువారు మున్ముందుగ తమ తమ గృహ (కుటుంబ) నిర్మాణమును నిర్వర్తింపవలెను. చక్కని కుటుంబము సోదరత్వమునకు, ప్రేమకు, సహకారమునకు, త్యాగమునకు, సహజీవనమునకు ప్రతీక. ఇదివరలో సోదరత్వమునకు కుటుంబము చక్కని విద్యాలయమని తెలుపుచుండెడివారము. చక్కని కుటుంబములే అరుదైన ఈ రోజులలో ఈ మాటలు చెప్పుట కూడ నిరర్థకమే అగుచున్నది. కుటుంబముల యందు ద్వేషములు, ఘర్షణలు తాండవముచేయుచుండ, జాతి యను పెద్ద కుటుంబ పునర్నిర్మాణమునకు పూనుకొనుట వెళితనము.

“ఉట్టి కెక్కలేనివాడు స్వర్గమున కెక్కుదును” అనినట్లుండును. నాగరికత పేరున మానవుడు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్న మొనర్చెను. అట్టివాడు భౌగోళికముగ మార్పులు తీసుకుని రాగలడు అని నమ్ముట కరడుగట్టిన అజ్ఞానము. ఈ కాలపు నాయకులెవ్వరును కూడ జాతి పునర్నిర్మాణమునకు అర్హులుగ గోచరించుట లేదు. అర్హులకు అవకాశము లేక, అవకాశము కలవారికి అర్హతలేక జాతిమొత్తము ఒక విషవలయమున తిరుగు చున్నది. కాలక్రమమున దైవమే పరిష్కార మొసంగగలడు. అంత వఱకు ఓర్పు వహించి ఉండుటయే కర్తవ్యము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


02 Dec 2021

No comments:

Post a Comment