మైత్రేయ మహర్షి బోధనలు - 46


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 46 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 34. మార్గశీర్షము 🌻

సృష్టి యందు స్థూలము నుండి సూక్ష్మమునకు, సూక్ష్మము నుండి స్థూలమునకు మార్గములు కలవు. జీవుడు తన అనురక్తిని బట్టి సూక్ష్మము లేక వెలుగు మార్గములలోనికి, స్థూలము లేక చీకటి మార్గములలోనికి పయనించును. మార్గనిర్ణేత తానే! జీవుడు తనకు వలసిన అనుభవములను, తదనుగుణమైన ఆనందమును జీవుడు అన్వేషించుచుండును. రెండు మార్గములూ సృష్టియందలి మార్గములే. అనురక్తియే మార్గమును నిర్ణయించును. జీవుడు ఆనందాన్వేషణమున క్రమశః తప్పొప్పులు తెలిసికొనుచు దీర్ఘకాలమున జ్ఞానము పొందగలడు.

కొన్ని జన్మలు పదార్థమయ విషయములందనురక్తి. మరికొన్ని జన్మలు పరమార్థమయ విషయము లందనురక్తి. అది కారణముగా పదార్థమయ విషయము లందు విరక్తి కలుగుచుండును. పూర్ణపురుషుడైన భగవంతునకు పదార్థమయము, పరమార్థమయము అగు లోకములు రెండునూ సమ పాళ్ళలో అంగీకారములే! మానవుని యందు కూడా అట్టి అంగీకారము ఏర్పడినపుడు అతడు పూర్ణుడగును. పూర్ణపురుష మార్గమే “మార్గశీర్ష మార్గము.” యోగమునకు అధిపతియైన “దత్తాత్రేయుడు” మరియు మా గురుపరంపర యీ మార్గమును నిర్దేశించుటకై సనాతనముగ నిలచియున్నాము. భగవద్గీత మాకు ప్రమాణము. యోగ సూత్రములు మేమందించు యోగమార్గము. మార్గశీర్షమును పండించుకొన దలచిన వారు యోగ సూత్రములను, భగవద్గీతను దీక్షతో ఆజన్మాంతమూ అనుసరింపవలెను.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

22 Dec 2021

No comments:

Post a Comment