🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 50 🌹


*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 50 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 38. సేవా సూక్ష్మము 🌻*

*సామాన్యులను అశ్రద్ధ చేయకుము. మితిమీరిన సౌకర్యములను కోరువారిని ఎక్కువగ పట్టించుకొనకుము. మొదటి తెగవారు తెగపడి సంఘమున ఆర్జనము చేయక, చేయలేక యుందురు. రెండవవారు వారి స్థితిగతుల నుపయోగించుకొని రకరకములైన యుక్తులతో జీవింపజూతురు. మొదటివారికి సహాయమవసరము. రెండవ తెగవారు వారికి వారే సహాయము చేసుకొందురు కనుక మీ అవసరముండదు. ఇది తెలిసి మసలుట నీయందు సాధు జీవనమును పెంచును. అహంకారులకు చేయు సహాయము నిరర్థకము, నిష్ఫలము, దుఃఖహేతువు కూడ.*

*ఒకానొక పుణ్య క్షేత్రమున మేమెరిగిన సాధువు ఒకడున్నాడు. అతడు వందల సంవత్సరములనుండి క్షేత్రమునకు వచ్చు సామాన్యులను గుర్తించి స్వచ్ఛందముగ వారికి వలసిన సహాయము చేయు చుండును. మరికొందరికి సహాయమవసరమైనను చేయడు. అది గమనించిన తోటి సాధువొకడు "కోరినవారికి చేయక కోరనివారికి చేతువేమి?” అని అడిగెను. దానికి సాధువిట్లు సమాధాన మిచ్చెను. "కోరినవారు సౌకర్యములను కోరుచున్నారు.*

*యాత్రికులకు దైవము ముఖ్యము కాని తిండి, పడక కాదు కదా! వారు సౌకర్యకాములు. తిండి, పడక కోరువారికి నేను సాయము చేయను. దైవమును కోరి వచ్చినవారు తిండికి, పడకకు లెక్కచేయరు. కావున వారికి సౌకర్యము లేర్పరచుదును. మరియొక విశేషమున్నది. కేవలము దైవమును కోరి వచ్చు సామాన్యులలో అప్పుడప్పుడు మహాత్ములు కూడ చనుదెంతురు. కాబట్టి సామాన్యుల సేవనమే తృప్తి, ఆత్మానందము కలిగించును. నీవును అట్లే చేయుము” అని తెలిపెను.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment