గీతోపనిషత్తు -300


🌹. గీతోపనిషత్తు -300 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 19-1 📚

🍀 19-1. ద్వంద్వ స్థితులు - ఒకే - తత్త్యము ప్రకృతి పురుషులుగ ఏర్పడి, పరస్పర విరుద్ధమగు లక్షణములను సృష్టిలోనికి విడుదల చేయుచు, సృష్టి నిర్వర్తించుచు నుందురు. సూర్య కిరణముల ద్వారా జలములు తపింప జేసి, మరల వర్షము ద్వారా జలముల నందించు చున్నాడు. సృష్టి లయము చెందుట, మరల సృష్టింప బడుట కూడ ఇట్లే జరుగుచున్నది. వెలుగు - నీడ, రాత్రి - పగలు- ఇట్లు దైవమే రెండుగ ఏర్పడి క్రీడించు చున్నాడు. 🍀

తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19

తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.

వివరణము : ఈ శ్లోకమున దైవము ద్వంద్వములు నేనే అని తెలుపుచున్నాడు. సూర్యకిరణముల ద్వారా జలములు తపింపజేసి, మరల వర్షము ద్వారా జలముల నందించు చున్నాడు. సృష్టి లయము చెందుట, మరల సృష్టింపబడుట కూడ ఇట్లే జరుగుచున్నది. శ్వాస పీల్చుట - శ్వాస వదలుట, ఇచ్చుట - పుచ్చుకొనుట, పొందుట - కోల్పోవుట, పుట్టుట - మరణించుట, పెరుగుట - తరుగుట, కనబడుట - కనబడకుండుట, కదలుట - కదలకుండుట, ఎగురుట - పడుట, వెలుగు - నీడ, రాత్రి - పగలు- ఇట్లు దైవమే రెండుగ ఏర్పడి క్రీడించుచున్నాడు.

ఒకే - తత్త్యము ప్రకృతి పురుషులుగ ఏర్పడి, పరస్పర విరుద్ధమగు లక్షణములను సృష్టిలోనికి విడుదల చేయుచు, సృష్టి నిర్వర్తించుచు నుందురు. ప్రకృతి పురుషులుగను, ప్రజ్ఞ పదార్ధములుగను, రెండు కిరణములుగ, రెండు శ్వాసలుగ ఒక దానినొకటి పోటీగ నేర్పరచి, సృష్టి నిర్వహణమును చేయుచున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


02 Jan 2022

No comments:

Post a Comment