గీతోపనిషత్తు -304


🌹. గీతోపనిషత్తు -304 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 1 📚

🍀 20-1. కోరికలు - ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు. భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. 🍀

త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |
పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ || 20

తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.

వివరణము : ఎవరు దేనిని గూర్చి ప్రార్ధన చేసిన వారికది లభించుట సృష్టియందు సహజము. సంకల్పబలము, శుద్ధి, దీక్ష కలిగి దేనిని కోరి దైవమును ప్రార్థించినను, అద్దానిని దేవుడిచ్చుట జరుగుచు యుండును. ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు.

భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. గజతురగాది బలమును, పశుగణమును కోరువారుకూడ గలరు. వర్షము కోరువారు, ఫలపుష్ప సంపదను కోరువారు, అందమును కోరువారు ఇట్లు కోటాను కోట్ల కోరికలు జీవులు దైవమును కోరుచునుందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


10 Jan 2022

No comments:

Post a Comment