🌹 . శ్రీ శివ మహా పురాణము - 502 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 41
🌻. వివాహ మండపము -2 🌻
ఓ నారదా! మహాప్రాజ్ఞా! శివుడు పార్వతిని వివాహమాడుటకై గణములతో కూడి వరయాత్రా సమేతుడై ఇంతవరకు రాలేదు (11). ఓ నారదా! ఇది విశ్వకర్మ సద్బుద్ధితో చేసిన విచిత్రమని యెరుంగుము. ఓ దేవర్షీ! విస్మయమును వీడుము. స్వస్థుడవై శివుని స్మరించుము (12). నీవు భోజనము చేసి , విశ్రమించి, నాపై దయ యుంచి, మైనాకుడు మొదలగు పర్వతములతో గూడి ఆనందముతో శంకరుని వద్దకు వెళ్లుము (13).
ఓ మహామతీ! ఈ పర్వతములతో గూడి నీవు శీఘ్రమే శివుని వద్దకు వెళ్లి ప్రార్థించుము. దేవతలతో కూడి యున్నవాడు, మహర్షుల సంఘములచే, మరియు దేవతలచే రాక్షసులచే పూజింపబడే చిగుళ్ల వంటి పాదములు గలవాడు అగు శివుని ఇచటకు తీసుకొని రమ్ము (14).
బ్రహ్మ ఇట్లు పలికెను-
సరే యని పలికి నీవు వెంటనే ఆ పర్వత రాజకుమారులతో, మరియు ఇతరులతో గూడి మరలివచ్చితివి. విశాల హృదయుడవగు నీవు అచటి కార్యమును చక్కబెట్టి, భోజనము చేసి శీఘ్రమే శివుని సన్నిధికి వచ్చితివి (15). అచట దేవతలు మొదలగు వారిచే చుట్టు వారబడి యున్న మహాదేవుని చూచి నీవు, ఆ పర్వతులు భక్తితో ఆయనకు నమస్కరించిరి (16).
ఓ మునీ! అపుడు నేను, విష్ణువు, ఇంద్రుడు, సర్వ దేవతలు, మరియు రుద్రుని అనుచరులు అందరు నిన్ను ప్రశ్నించితిమి (17). అనేకములగు ఆభరణములను ధరించి యున్న మైనాక సహ్య మేరు ఇత్యాది పర్వతులను చూచిన వెంటనే అందరి మనస్సులు సందేహముచే వ్యాకులమైనవి. వారికి విస్మయము కలిగినది (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
10 Jan 2022
No comments:
Post a Comment