గీతోపనిషత్తు -307


🌹. గీతోపనిషత్తు -307 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 4 📚

🍀 20-4. కోరికలు - కోరిక ఏదైన అది బంధమునకు మార్గమే యగును. భోగములం దాసక్తి జీవుని భోగపరునిగ బంధించును. సకామభక్తులు పూర్ణ వికాసము కలిగిన వారు కాదు. వీరు పునరావృత్తి మార్గమున జనన మరణ సంస్కార చక్రమునందు తిరుగాడుచు నుందురు. వారి కోరికలచే వారిని వారే బంధించుకొను చుందురు. ఎన్ని జన్మలెత్తినను కామములను పూరించుట సాధ్యము కాని పని. కనుక జనన మరణములను అనుభవించుచునే యుందురు. 🍀


20. త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |
పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ ||

తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.

వివరణము : ఈ శ్లోకమున సకామ కర్మమార్గమునకు కూడ తానే అధిపతినని తెలుపుచున్నాడు. ఇట్టి సకామభక్తులు పూర్ణ వికాసము కలిగిన వారు కాదు. వీరు పునరావృత్తి మార్గమున జనన మరణ సంస్కార చక్రమునందు తిరుగాడుచు నుందురు. వారి కోరికలచే వారిని వారే బంధించుకొను చుందురు.

కోరిక ఏదైన అది బంధమునకు మార్గమే యగును. ఇనుప సంకెళ్ళతో బంధించినను, బంగారు సంకెళ్ళతో బంధింప బడినను, బంధము బంధమే యగును. భోగము లందాసక్తి జీవుని భోగపరునిగ బంధించును.

భోగములు రోగములకు కూడ హేతువు లగుచుండును. భోగ రోగముల నడుమ జీవితము సాగుచుండును. ఎన్ని జన్మలెత్తినను కామములను పూరించుట సాధ్యము కాని పని. చిల్లుకుండలో ఎంతనీరు పోసినను అది నిండుకుండ కాజాలదు. అయినప్పటికిని ఈ జ్ఞానము కలుగువరకు జీవులు కోరుచునే యుందురు. కనుక జనన మరణణము లనుభవించుచునే యుందురు. కామ్యకర్మ జీవునకు పరిష్కారము కాదు. నిష్కామకర్మయే పరిష్కారము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


16 Jan 2022

No comments:

Post a Comment