శ్రీ శివ మహా పురాణము - 505


🌹 . శ్రీ శివ మహా పురాణము - 505 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 41

🌻. వివాహ మండపము - 5 🌻


నారదడిట్లు పలికెను-

దేవ దేవా! మహాదేవా! నా శుభవచనమును వినుము. ఓ నాథా! వివాహము నందు విఘ్నము కలుగుననే భయము ఏమియూ లేదు (42). హిమవంతుడు కన్యకను నీకిచ్చుట నిశ్చయము. ఈ పర్వతులు నిన్ను దోడ్కొని వెళ్లుటకై వచ్చి యున్నారు. సంశయము లేదు (43). ఓ సర్వజ్ఞా! కాని దేవతలను మోమింపజేసి కుతూహలమును కలిగించుట కొరకై అద్భుతమగు మాయ రచింపబడినది. విఘ్నము కలిగే ప్రసక్తియే లేదు (44). హే విభూ! హిమవంతుని ఆజ్ఞచే ఆతని గృహమునందు మహామాయావి యగు విశ్వకర్మ అనేకములగు అద్భుతములతో నిండియున్న విచిత్ర మగు మండపమును నిర్మించెను (45).

దేవ సమాజమంతయూ అచట మోహమును కలిగించు రీతిలో నిర్మింపబడనది. నేను దానిని చూచి ఆ మాయచే విమోహితుడనై విస్మయమును పొందితిని (46).

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! లోకాచారములను ప్రవర్తిల్ల జేయు శంభు ప్రభుడు ఆ మాటను విని నవ్వి విష్ణువు మొదలగు దేవతలందరితో నిట్లనెను (47).

ఈశ్వరుడిట్లు పలికెను-

హిమవంతుడు నాకు కన్యను ఇచ్చే పక్షంలో మాయతో నాకు పనియేమి? ఓ విష్ణూ! నీవు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము (48). ఓ బ్రహ్మా! ఇంద్రా! మునులారా! దేవతలారా! సత్యమును పలుకుడు. పర్వతరాజు కన్యకు ఇచ్చే పక్షంలో నాకు మాయతో పని యేమి? (49) ఉపాయమేదైన ఫలమును సాధించవలెనని నీతివేత్తలగు పండితులు చెప్పెదరు. కావున మీరందరు విష్ణువును ముందిడు కొని వివాహకార్యము కొరకు శీఘ్రమే ముందుకుసాగుడు (50).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ విధముగా దేవతలతో సంభాషించు చున్న ఆ శంభుడు అపుడు ప్రాకృతమానవుడు వలె మన్మథునకు వశుడైనట్లుండెను (51). అపుడు శంభుని ఆజ్ఞచే విష్ణువు మొదలగు దేవతలు, ఋషులు, మరియు సిద్ధులు మోహజనితమగు భ్రమను విడనాడిరి (52). ఓ మునీ! నిన్ను, ఆ పర్వతులను ముందిడు కొని విస్మ యావిష్టులైన ఆ దేవతలు మొదలగు వారు పరమాశ్చర్యకరమగు హిమవంతుని మందిరమునకు అపుడు వెళ్లిరి (53). తరువాత విష్ణువు మొదలగు వారితో, మరియు ఆనందముతో కూడియున్న తన గణములతో కూడి ప్రహర్షితుడైన శివుడు హిమవన్నగర సమీపమునకు వచ్చెను (54).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో వివాహమండప వర్ణనమనే నలభై ఒకటవ అధ్యాయము ముగిసినది (41).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


16 Jan 2022

No comments:

Post a Comment