🌹. గీతోపనిషత్తు -313 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -2 📚
🍀 22-2. అభియుక్తుడు - అంతయు దైవ స్వరూపమే అనెడి భావన మన యందు స్థిరపడినచో అంతటిని దైవముగ చూచుట వీలుపడును. అనన్యచింతన అనగా ఎప్పుడునూ దైవమునే చింతించుట లేక భావించుట. ఇది నిత్య జీవన సాధన. దీని వలన నిత్య జీవన యోగము లభించును. దీని యందు ఏమి చూచినను, దేనిని చూచినను, ఎవరిని చూచినను ఆ కనపడు చున్నది ఈశ్వరుడే అను భావన కలుగవలెను. ఇతరములుగ గోచరించినదంతయు ఈశ్వరుడే అను భావన సిద్ధించవలెను 🍀
22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||
తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.
వివరణము : అనన్యచింతన అనగా ఎప్పుడునూ దైవమునే చింతించుట లేక భావించుట. కనబడుచున్న దంతయు దైవమే. వినబడుచున్న దంతయు దైవమే. ఇంద్రియముల ద్వారా గ్రహించున దంతయు నిజమునకు దైవమే. సమస్త సృష్టి యంతయు తానే నిండియున్నానని ముందు శ్లోకములలో దైవము తెలియపరిచి యున్నాడు.
కనుక అంతయు దైవ స్వరూపమే అనెడి భావన మన యందు స్థిరపడినచో అంతటిని దైవముగ చూచుట వీలుపడును. ఇది నిత్య జీవన సాధన. దీనివలన నిత్య జీవన యోగము లభించును. భార్యను భర్త చూచినపుడు భార్య ఈశ్వర స్వరూపమే. యథార్ధమదియే. కాని భార్య గుర్తువచ్చునా? ఈశ్వరుడు గుర్తు వచ్చునా? ఇక్కడే సాధకుని సాధన తేలిపోవును. అట్లే ఏమి చూచినను, దేనిని చూచినను, ఎవరిని చూచినను ఆ కనపడు చున్నది ఈశ్వరుడే అను భావన కలుగవలెను. ఇతరములుగ గోచరించినదంతయు ఈశ్వరుడే అను భావన సిద్ధించవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
28 Jan 2022
No comments:
Post a Comment