శ్రీ శివ మహా పురాణము - 511

🌹 . శ్రీ శివ మహా పురాణము - 511 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 43

🌻. శివుని అద్భుత లీల - 3 🌻


ఇంతలో అంతకు రెట్టింపు కాంతి గలవాడు, దేవతలందరిలో శ్రేష్ఠుడు, అనేక దివ్యప్రభలు గలవాడు, దేవతలకు ప్రభువు అగు ఇంద్రుడు వచ్చెను (25). ఆ మేనక ఆతనిని చూచి ఈతడే శంకరుడని పలికెను. అపుడు నీవు 'ఇతడు దేవతలకు అధిపతి యగు ఇంద్రుడు; రుద్రుడు కాడు' అని చెప్పితివి (26). ఇంతలో అంతకు రెట్టింపుశోభను కలిగియున్న చంద్రుడు వచ్చెను. ఆమె ఆతనిని చూచి ఈతడు రుద్రుడని పలుకుగా, నీవామెతో కాదని చెప్పితివి (27). అంతకు రెట్టింపు శోభ గల సూర్యుడు ఇంతలో ముందుకు వచ్చెను. ఆతనిని చూచి ఆమె శివుడీతడే అని పలుకగా, నీవామెతో కాదని చెప్పితివి (28).

ఇంతలో అచటికి తేజోరాశులగు భృగువు మొదలైన మునిశ్రేష్టులు తమ శిష్యగణములతో గూడి విచ్చేసిరి (29). వారి మధ్యలో నున్న బృహస్పతిని చూచి ఆ మేనక 'పార్వతీ పతి యగు రుద్రుడీతడే' అని పలుకగా, కాదని నీవు చెప్పితివి (30). ఇంతలో అచటకు గొప్ప తేజోరాశి, ఋషిశ్రేష్ఠులచే కుమారులచే స్తుతింపబడు వాడు, సాక్షాత్తుగా మూర్తీభవించిన ధర్మము వలె నున్న బ్రహ్మా విచ్చేసెను (31). ఓ మునీ! ఆయనను చూచి అపుడు మేన మహానందమును పొంది 'గిరిజాపతి యగు శివుడితడే' అని పలుకగా, నీవామెతో కాదని చెప్పితివి (32).

ఇంతలో అచటకు సర్వశోభలతో కూడిన వాడు, మేఘమువలె నీలవర్ణము గలవాడు, నాల్గు చేతులవాడు (33), కోటి మన్మథుల లావణ్యము గలవాడు, సత్త్వగుణప్రధానుడు, గరుడుడు వాహనముగా గలవాడు (34), శంఖము మొదలగు చిహ్నముతో కూడినవాడు, లక్ష్మీపతి, ఇంద్రియ గోచరము గాని ప్రకాశము గలవాడు నగు శ్రీవిష్ణుదేవుడు విచ్చేసెను (35). ఆయనను చూచి విస్మయము నిండిన కన్నులతో ఆ మేన మహానందమును పొంది 'పార్వతీపతి యగు శివుడు నిశ్చయముగా నీతడే, సందియము లేదు' అని పలికెను (36).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2022

No comments:

Post a Comment