మైత్రేయ మహర్షి బోధనలు - 64
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 64 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 50. సత్యము - అతీతము 🌻
వ్యక్తి, కుటుంబము, వివిధ సంఘములు, జాతి, దేశములు అన్నియును శాంతి కొరకే పాటుపడుచున్నవి. జీవనమును మెరుగు పరుచుకొనుటకై కృషి సల్పుచున్నవి. తమ బాగుకు, తమ శాంతికి చేయు ప్రయత్నములు ఇతరులపై ఎట్టి ప్రభావమును చూపుచున్నవో గమనింపక పోవుట వలన తమ శాంతి, తమ బాగు అను ప్రయోజనములకు దెబ్బ తగులుచున్నది. మన మేలు ఇంకొకరికి కీడు కారాదు. మనము కోరు శాంతి ఇతరులకశాంతి కలిగింపరాదు. అందరికిని ఒకే రకపు మేలు గాని, శాంతి గాని అవసరమై ఉండదు.
కొందరికి ఆరోగ్యశాంతి కావలెను. కొందరికి ధనశాంతి, కొందరికి కీర్తి శాంతి, ఇంకొందరికి ఆర్జన శాంతి. ఏ కొందరికో కేవలము ప్రశాంతి. ఈ కాలమున అగ్రదేశములవారు అధికారము కొరకు, ఆర్థిక ఆధిపత్యము కొరకు ఇతరులకశాంతి కలిగించు చున్నారు. ఇది అనాదిగా జాతిలో గల జాడ్యమే. ప్రపంచమున వివిధ జాతులు గలవు. వారికి గల అవగాహన వివిధము. వారి సిద్ధాంతములు వివిధము. వారి వారి అనుభవములు వివిధములు. ఇందు ఏ ఒక్కటి ఇతరులకు అంగీకారము కాదు. అన్నింటిని సమన్వ యించుకొనగల స్పూర్తియే పరిష్కారము. ఇది మతములకు, సిద్ధాంతములకు అతీతమైన సత్యము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
27 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment