మైత్రేయ మహర్షి బోధనలు - 68
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 68 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 54. కుష్టువ్యాధి - నివారణము 🌻
నిర్మలమైన మనస్సే శుద్ధ చైతన్యమును ఆవిష్కరింప గలదు, ప్రకటింప గలదు, ప్రశాంతత నందించ గలదు. దీనిని సాధించుటే సూటియైన దారి. దీనిని సాధింపక ఎన్ని సాధించినను సాధకుడు చిక్కులు పడును. రజోగుణము, తమోగుణము ఈ సాధన వలననే ఉపశమింప బడగలవు, సమన్వయింప బడగలవు కూడ. సిద్ధికి ఇది దగ్గర దారి. కాలము వృధా చేయక, మనసు నందు కలుగుచున్న వికారములను ఆత్మ పరిశీలనముతో ప్రక్కకు నెట్టి, నిర్మల భావములను, భాషను, చేతను ప్రకటించు చుండుము. అలసత్వము, సోమరితనము, నిర్లక్ష్యము, అశ్రద్ధ, అతినిద్ర అజ్ఞానమను ఒకే ఊయలలో నిన్ను శాశ్వతముగ బంధింపగలవు. వానిని దరి చేరనీయకుము.
అసూయ కుష్టురోగము వంటిది. శరీర మంతటను కుష్టు వ్యాపనము చెందునట్లుగ, అసూయ మనసులో మొలకెత్తి, దేహమంతను వ్యాపించి కంపరమెత్తించును. అసూయ వలన ఎందరో సాధకులు పతనము చెందిరి. అసూయ గలవానికి జ్ఞానము హరింపబడి అహంకారము ఆవిర్భవించును. సర్వవిధముల సద్భావమే మానవునకు పరిష్కారము. ఇది తెలిసియు ఆచరించ కుండుట దురదృష్టము. ఆచరించుటయే అదృష్టము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
04 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment