మైత్రేయ మహర్షి బోధనలు - 70


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 70 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 56. సేవా సంస్థ - మూలసూత్రములు 🌻


స్వచ్ఛంద సేవా సంస్థలలో నిర్బంధమొక అపశ్రుతి. ఇట్టి సంస్థల యందు పరిశ్రమించుట స్వచ్ఛందముగ నుండవలెను. సహకారము గూడ స్వచ్ఛందమే. సహజీవనములు కూడ స్వచ్ఛందములై యుండవలెను. తెలిసినవారిని, పెద్దవారిని- తెలియనివారు, చిన్నవారు గౌరవించుట కూడ స్వచ్ఛందముగ సాగవలెను. పెద్దవారనుకొనువారు చిన్నవారిపై అధికారము చెలాయించ రాదు. ఎవరును ఎవరిని నిర్బంధించరాదు. ఆత్మస్తుతి, పరనింద పనికిరాదు. ఉన్నతమైన భావములను సదా పెంపొందించుకొను చుండవలెను. విమర్శలు విషప్రయోగము వలె సంస్థను చెరచును.

ఉన్నత భావములు ఆచరణాత్మకమైనచో, సభ్యుల ప్రజ్ఞ ఉత్తమ కక్ష్యలలో నిలచి, నిర్మలత్వము, ప్రశాంతత, వైభవము కలిగించును. విమర్శలు, సహాయ నిరాకరణము, మానసిక విముఖత సభ్యులను మురికి కూపములలోనికి కొనిపోవును.సంస్థ యందు గల సభ్యుడు తనయందు కలుగు భావములను ప్రతినిత్యము పరిశీలించు కొనుచుండవలెను. ఉన్నత భావములు ఆచరణాత్మకమైన జీవనము సాగుచున్న యెడ, ఆకసమునకేగు విహంగములవలె నిర్మలత్వమును, ప్రశాంతతను, తత్ఫలమైన ఆనందమును, వైభవమును పొందుదురు. విమర్శలయందు జీవించుచున్నచో ఎలుకలవలె కలుగులలోనికి దూరి చీకటి గృహములుగ తమ జీవనమును భ్రష్టుకావించు కొందురు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


08 Feb 2022

No comments:

Post a Comment