గీతోపనిషత్తు -329


🌹. గీతోపనిషత్తు -329 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 26-2 📚

🍀 26-2. భక్తి శ్రద్ధలు - శ్రద్ధ వలన జ్ఞానము, భక్తి వలన అనుగ్రహము లభించును. ఆడంబరములకు గాని, డంభమునకు గాని, అహంకారమునకు గాని, అశ్రద్ధకు గాని దైవము లొంగడు. కృష్ణతులాభారము, కుచేలోపాఖ్యానము, అంబరీషుని కథ- ఇట్టి ఉపాఖ్యానము లన్నియు భక్తి ప్రాధాన్యతను ఆవిష్కరించు చున్నవి. ఎవరికి ఏ పని చేసిపెట్టుచున్నను వారియందలి ఈశ్వరుని దర్శించుట వలన భక్తి ప్రేమలు జనించును. అట్టి బుద్ధితో చిన్నవారికైనను, పెద్దవారికైనను అదే విధమగు శ్రద్ధాభక్తులతో చేయవలెను. 🍀

26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః ||

తాత్పర్యము : భక్తిపూర్వకముగ నాకు ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని ఎవరందించినను నేను స్వీకరించి అనుగ్రహింతును.


వివరణము :

సర్వేశ్వరుండగు శౌరి కింకరు సేయు ధనమున్నదే భక్తి ధనము కాక !
సర్వోపగతుడగు చక్రి బంధించెడు బలమున్నదే భక్తిబలము గాక !
సర్వభోక్తను జలజాతాక్షు దనియించు ఫలమున్నదే భక్తిఫలము గాక !
సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు విద్య యున్నదె భక్తివిద్య గాక !
సర్వవరదుడైన శార్జి సన్నిధి చేర్చుపథము గలదె భక్తిపథము గాక !
కాన నితడు భక్తిగల వారలకే గాని పరుల కగ్గమగునె పడతులార !!


భక్తితో ఏమిచ్చినను దైవ మంగీకరించును. దైవమునకు సమర్పించుట యనగా జీవులయందలి ఈశ్వరుని దర్శించుచు, జీవులకు సమర్పించుటయే. అట్లు చేసినచో అది భక్తి నివేదన మగును. ఆడంబరములకు గాని, డంభమునకు గాని, అహంకారమునకు గాని, అశ్రద్ధకు గాని దైవము లొంగడు. కృష్ణతులాభారము, కుచేలోపాఖ్యానము, అంబరీషుని కథ- ఇట్టి ఉపాఖ్యానము లన్నియు భక్తి ప్రాధాన్యతను ఆవిష్కరించు చున్నవి. ఎవరికి ఏ పని చేసిపెట్టుచున్నను వారియందలి ఈశ్వరుని దర్శించుట వలన భక్తి ప్రేమలు జనించును. అట్టి బుద్ధితో చిన్న పనియైనను, పెద్ద పనియైనను చేయవలెను. చిన్నవారికైనను, పెద్దవారికైనను అదే విధమగు శ్రద్ధాభక్తులతో చేయవలెను.

శ్రద్ధ వలన జ్ఞానము, భక్తి వలన అనుగ్రహము లభించును. బ్రహ్మాండము లన్నియు తన కుక్షి (పొట్ట) యందే ఇముడ్చు కొనిన దైవమునకు ఎవడేమి ఈయగలడు? దైవమున కావశ్యకత ఏమున్నది? అతడు జీవుల ప్రేమకు, భక్తికి ఆనందించును. లోకము లందు కూడ తలిదండ్రులు పిల్లల నుండి ఆశించునది ప్రేమాభిమానములే గదా! అట్లే పరమాత్మ గూడను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 Mar 2022

No comments:

Post a Comment