గీతోపనిషత్తు -333


🌹. గీతోపనిషత్తు -333 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 27-3 📚


🍀 27-3. ఈశ్వరార్పణము - దైవ సమర్పితముగ జీవించువారే దైవ విభూతిని పొంద గలరు. భగవద్భక్తుల కథ లన్నియు ఈ సత్యమునే సూచించును. దీనియందు పట్టు చిక్కుటకు అంతఃకరణ శుద్ధి ప్రధానమై యున్నది. లేనిచో అహంకారము పొటమరించి, చిక్కులపాలు చేయును. సమర్పణ మార్గము నిరహంకార మార్గము. నిత్య సత్వగుణ మార్గము. అట్టివారికి దైవమే తానుగ నున్నాడని నిత్యము స్ఫురణ యందుండును. 🍀

27. యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||


తాత్పర్యము : ఏ పని చేసినను, ఏమి భుజించినను, ఎట్టి హోమములు గావించినను, ఎట్టి దానము లొనర్చినను, ఎట్టి తపస్సులు చేసినను నా కర్పణము చేయుము.

వివరణము : తానే సృష్టి నిర్మాణము గావించి, అనేకానేక దేహ నిర్మాణములు గావించి, వానియందు తానే జీవునిగ ప్రవేశించి క్రీడ చూపుచున్నాడు. తన వలెనే జీవులను కూడ ఆనందింపుడని సంకేతించు చున్నాడు. కనుక ఈ సమస్తము అతడిదే. మనము కూడ అతని పరివారమే. అంతేకాదు, అతని నుండి ఏర్పడిన మాయ కూడ అతనిదే. కనుక అంతయు అతనికి సమర్పణ చేసి జీవించుట నిజమగు ఎరుక. అట్టి ఎరుక లేకుండుట వలన జీవుడు చిక్కుపడును. కనుకనే దైవము, తనకు సమర్పణ చేసుకొని జీవించమని అర్జునునకు బోధించుచున్నాడు.

దైవ సమర్పితముగ జీవించువారే దైవ విభూతిని పొంద గలరు. భగవద్భక్తుల కథ లన్నియు ఈ సత్యమునే సూచించును. దీనియందు పట్టు చిక్కుటకు అంతఃకరణ శుద్ధి ప్రధానమై యున్నది. లేనిచో అహంకారము పొటమరించి, చిక్కులపాలు చేయును. సమర్పణ మార్గము నిరహంకార మార్గము. నిత్య సత్వగుణ మార్గము. అట్టివారికి దైవమే తానుగ నున్నాడని నిత్యము స్ఫురణ యందుండును. వారి కథలే భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యము లకు పరాకాష్ఠ.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2022

No comments:

Post a Comment