గీతోపనిషత్తు -334
🌹. గీతోపనిషత్తు -334 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-1 📚
🍀 28-1. సన్యాస యోగము - సన్యాస యోగమనగా కర్మఫలములను సన్యసించుట, కర్మములను సన్యసించుట కాదు. కర్తవ్యకర్మలను నిర్వర్తించుచు అందుండి ఏర్పడు ఫలములను సన్యసింపవలెను. ఫలముల యందాసక్తితో కర్మము నిర్వర్తించువారు బద్దులగుచునే యుందురు. ఫలాసక్తి లేక నిత్యనైమిత్తిక కర్మలను నిర్వర్తించు చుండుటచే జీవుడు స్థితప్రజ్ఞు డగును. ఇదియే నిష్కామ కర్మయోగము లేక కర్మఫల సన్యాస యోగము. 🍀
28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||
🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.
🌻. వివరణము : ఈ శ్లోకమున ప్రధానముగ రెండు విషయములు భగవానుడు తెలియజేయు చున్నాడు.
1. సన్యాస యోగము. 2. కర్మబంధము నుండి విముక్తి.
సన్యాస యోగమనగా కర్మఫలములను సన్యసించుట, కర్మము లను సన్యసించుట కాదు. కర్తవ్యకర్మలను నిర్వర్తించుచు అందుండి ఏర్పడు ఫలములను సన్యసింపవలెను. ఫలముల యందాసక్తితో కర్మము నిర్వర్తించువారు బద్దులగుచునే యుందురు. కర్తవ్య కర్మలను నిర్వర్తింపకున్నచో కూడ బంధము లేర్పడును. నిర్వర్తించు నపుడు ఫలములందాసక్తి యున్నచో బంధము లుండును.
ఫలాసక్తి లేక నిత్యనైమిత్తిక కర్మలను నిర్వర్తించు చుండుటచే జీవుడు స్థితప్రజ్ఞు డగును. ఇదియే నిష్కామ కర్మయోగము లేక కర్మఫల సన్యాస యోగము. ఫలముల యందాసక్తి లేక చేయవలసిన పనియందే శ్రద్ధా భక్తులు గలవారు క్రమముగ ఫల సన్యాసమేగాక సంకల్ప సన్యాసము గూడ నిర్వర్తింతురు. స్వంత సంకల్పములు గలవానికి, వానిని సిద్ధింప చేసుకొన వలెనను ఆకాంక్ష యుండును. దాని వలన కర్మబంధ మేర్పడు చుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment