గీతోపనిషత్తు -336


🌹. గీతోపనిషత్తు -336 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-3 📚


🍀 28-3. సన్యాస యోగము - శుభకర్మలు శుభ ఫలముల నిచ్చు చుండును. అశుభ కర్మలు అశుభ ఫలముల నిచ్చుచుండును. పుణ్యకార్యములు చేయువారు పుణ్యఫలములచే బంధింప బడుదురు. పాపకార్యములు చేయువారు పాపఫలములచే బంధింపబడు చుందురు. ఫలాసక్తి లేకుండ కర్మలాచరించుటయే నిజమగు మార్గము. తమదగు సంకల్పములు కూడ చేయని వారు మహాత్ములు. ఆరంభ పరిత్యాగము వారి సహజ స్వభావము. 🍀

శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి || 28

🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.

🌻. వివరణము : విముక్తి అనగా విశిష్టమగు ముక్తి. అట్టివాడే తనను చేరగలడని దైవము స్పష్టము చేసినాడు. ధీమంతు లెవరైనను ఇట్టిమార్గమున పయనింపవలెను. ఇతర మార్గములలో బంధవిమోచన ముండదు. ఇది సత్యము. మరియొక విషయము. శుభకర్మలు శుభ ఫలముల నిచ్చు చుండును. అశుభ కర్మలు అశుభ ఫలముల నిచ్చుచుండును. పుణ్యకార్యములు చేయువారు పుణ్యఫలములచే బంధింప బడుదురు. పాపకార్యములు చేయువారు పాపఫలములచే బంధింపబడు చుందురు. ఫలాసక్తి లేకుండ కర్మలాచరించుటయే నిజమగు మార్గము. దుష్కర్మ లెట్లు బంధించునో, సత్కర్మలు కూడ అట్లే బంధించును. కారణము ఫలాసక్తియే.

తండ్రి ఆజ్ఞగా పరశురాముడు తల్లి శిరస్సును ఖండించెను. తల్లి శిరస్సు ఖండించుట దుష్కర్మ. తండ్రి ఆజ్ఞను పరిపాలించుట కర్తవ్యము. పరశురాముడు కర్తవ్యమునే నమ్మెను. తల్లిగదా యని ఉపేక్షించ లేదు. తండ్రియగు జమదగ్ని మహర్షితో వాదింపలేదు. కర్తవ్యమున మాత్రమే నిలబడెను. అట్లే దశరథ రాముడు కూడ కర్తవ్యమునే పాలించెను. ఫలము లాసింపలేదు. తమదగు సంకల్పములు కూడ చేయనివారు మహాత్ములు. ఆరంభ పరిత్యాగము వారి సహజ స్వభావము. ఇట్టి కర్మ స్వరూపము స్పష్టముగ తెలిసిన మానవునకు ఈ క్షేత్రము కురుక్షేత్రము గాను, ధర్మ క్షేత్రముగాను గోచరించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


15 Mar 2022

No comments:

Post a Comment