గీతోపనిషత్తు -337


🌹. గీతోపనిషత్తు -337 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-4 📚


🍀 28-4. సన్యాస యోగము - సంకల్పించుట, ఫలములాసించుట విసర్జించ వలెను. అన్నియు ఈశ్వరున కర్పించి, ఈశ్వరాధీనముగ జీవితమును నిర్వర్తించుకొనవలెను. కర్తవ్యములు మన వద్దకు కాలము రూపమున, దేశము రూపమున నడచి వచ్చును. మన మేమియు ప్రత్యేకించి సంకల్పింప అవసరము లేదు. దరిజేరిన కర్తవ్యమును పాలించుటయే. ఫలముల యందాసక్తి అవసరము లేదు. బుద్ధిమంతుడు భగవానుడు పలికిన సన్యాస యోగ మవలంబించి, భగవంతునితో సదా కూడి యుండుట నేర్వవలెను. అట్టి వానికి మోక్ష స్థితి తథ్యము. 🍀

28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగ యుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||

🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.

🌻. వివరణము : కర్తవ్యములు మన వద్దకు కాలము రూపమున, దేశము రూపమున నడచి వచ్చును. మన మేమియు ప్రత్యేకించి సంకల్పింప అవసరము లేదు. దరిజేరిన కర్తవ్యమును పాలించుటయే. ఫలముల యందాసక్తి అవసరము లేదు. అట్టి వానికి మోక్ష స్థితి తథ్యము. పుణ్యము కోసము పుణ్యకర్మలు ఆచరించు వారు మోక్షమును పొందలేరని భగవాను డిచ్చట హెచ్చరిక చేయు చున్నాడు. కర్మ స్వరూప స్వభావములు, అవి బంధించు విధానము మానవులకు తెలియవలెను. కర్తవ్యమెంత ప్రధానమో కూడ తెలియవలెను.

సంకల్పించుట, ఫలములాసించుట విసర్జించ వలెను. అన్నియు ఈశ్వరున కర్పించి, ఈశ్వరాధీనముగ జీవితమును నిర్వర్తించు కొనవలెను. దుఃఖము, కష్టనష్టములు ఎట్లు బంధించునో, సుఖములు భోగభాగ్యములు కూడ అట్లే బంధించును. ఇనుప పంజరములో నున్నను, బంగారు పంజరములో నున్నను బంధ మొకటియే. కావున బుద్ధిమంతుడు భగవానుడు పలికిన సన్యాస యోగ మవలంబించి, భగవంతునితో సదా కూడి యుండుట నేర్వవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2022

No comments:

Post a Comment