గీతోపనిషత్తు -340


🌹. గీతోపనిషత్తు -340 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 29-3 📚


🍀 29-3. అతీత స్థితి - అతడు 'సమోహం' అని పలికినపుడు అతని అతీత స్థితిని ఆవిష్కరించు చున్నాడు. కాలమును బట్టి, దేశమును బట్టి వివిధ వ్యూహములలో వర్తించుచు, ఎప్పటికప్పుడు సృష్టియందు ధర్మమును వర్తింప జేయును. సృష్టి కతీతముగను, సృష్టియందు కూడ ఏకకాలమున వర్తించు తత్త్వదర్శనమే కృష్ణ దర్శనము. దైవమును విశ్వ చైతన్య పరముగ చూచుట, అవగాహన చేసుకొనుట శక్యమేగాని తదతీతమై సత్యస్థితిని తెలుయుట అరుదు. అట్లు తెలిసినపుడు దైవమునకు ఇష్టులు అయిష్టులు ఉండరని తెలుయును. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహములలో అతడు చరించుచు అతీతముగను, సృష్టి యందు ధర్మస్వరూపుడుగను, జ్ఞాన బోధకుడుగను, నిర్వాహకుడుగను- నాలుగు విధములుగను చరించును. 🍀

సమో హం సర్వభూతేషున మే ద్వేష్యో స్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ II 29

తాత్పర్యము : సమస్త భూతములయందు నేను సమముగ నున్నాను. నాకు ద్వేషింపతగు వారుగాని, ప్రేమింపతగు వారు గాని ప్రత్యేకముగ నెవ్వరును లేరు. వారియందున్న నన్ను సేవించు వారిని నేనునూ సేవింతును.

వివరణము : దైవమును విశ్వ చైతన్య పరముగ చూచుట, అవగాహన చేసుకొనుట శక్యమేగాని తదతీతమై సత్యస్థితిని తెలుయుట అరుదు. అట్లు తెలిసినపుడు దైవమునకు ఇష్టులు అయిష్టులు ఉండరని తెలుయును. సత్యస్థితిలో శ్రీ కృష్ణునికి పాండవ కౌరవులు ఇరువురును సములే. చైతన్యస్థితిలో ధర్మస్వరూపులైన పాండవులనిన ఇష్టము. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ కృష్ణుడు చతుర్వ్యూహముల యందు చతుర్విధములుగ వర్తించుచుండును. ఎప్పుడెట్లు వర్తించునో ఎవ్వరునూ తెలియలేరు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహములలో అతడు చరించుచు అతీతముగను, సృష్టి యందు ధర్మస్వరూపుడుగను, జ్ఞాన బోధకుడుగను, నిర్వాహకుడుగను- నాలుగు విధములుగను చరించును.

అతడు 'సమోహం' అని పలికినపుడు అతని అతీత స్థితిని ఆవిష్కరించు చున్నాడు. కాలమును బట్టి, దేశమును బట్టి వివిధ వ్యూహములలో వర్తించుచు, ఎప్పటికప్పుడు సృష్టియందు ధర్మమును వర్తింప జేయును. సృష్టి కతీతముగను, సృష్టియందు కూడ ఏకకాలమున వర్తించు తత్త్వదర్శనమే కృష్ణ దర్శనము. ఎవరెంత మాత్రము తలచిన వారి కంతమాత్రముగనే గోచరించువాడు కృష్ణుడు. అతడే 'సమోహం' అని పలుకగలడు. గోవులకాచు గోపబాలకులను, గోలోక మందుండు సిద్ధపురుషులను ఒకే విధముగ ఆదరించిన వాడు శ్రీకృష్ణుడు. పరాక్రమవంతులను, పామరులను కూడ సమముగ ఆదరించిన వాడు కృష్ణుడు. అంతయు తానే అగుట వలన, తనయందు తానెప్పుడు యుండుటవలన అట్టి పరమోత్కృష్ట స్థితితో 126 సం||లు జీవించినవాడు శ్రీకృష్ణుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

23 Mar 2022

No comments:

Post a Comment