నిర్మల ధ్యానాలు - ఓషో - 168


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 168 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మొదటి జన్మతో శరీరం పుడుతుంది. రెండో జన్మతో ఆత్మ పుడుతుంది. ధ్యానం గుండా వ్యక్తి రెండవ జన్మ ఎత్తుతాడు. మనం ఆత్మ అని గుర్తించినపుడే మన జీవితం పరిపూర్ణం అవుతుంది. లేని పక్షంలో జీవితం అర్థరహితం. 🍀


ధ్యానమే జీవితానికి నిజమైన ఆరంభం. మొదటి పుట్టుక నిజమైన ఆరంభం కాదు. మొదటి పుట్టుక కేవలం జీవించడానికి కలిగిన అవకాశం. అది నువ్వు బతికి వుండడానికి శక్తి నిస్తుంది. ఆ శక్తిని యధార్థం కిందకు పరివర్తింప చేయాలి. అప్పుడు నువ్వు నిజంగా సజీవంగా వున్నట్లు అర్థం. ధ్యానం శక్తిని యధార్థంగా మారుస్తుంది. విత్తనాన్ని పువ్వుగా మారుస్తుంది. అందువల్ల ధ్యానం గుండా వ్యక్తి రెండవ జన్మ ఎత్తుతాడు. మొదటి జన్మతో శరీరం పుడుతుంది. రెండో జన్మతో ఆత్మ పుడుతుంది. మనం ఆత్మ అని గుర్తించినపుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది. లేని పక్షంలో జీవితం అర్థరహితం.

విత్తనం విత్తనంగానే మిగిలిపోతుంది. మొలకెత్తదు. చెట్టుగా వికసించదు. పూలు పూయదు. దానికింద ఎవరూ విశ్రాంతి పొందరు. దాన్ని ఏ పక్షులూ సందర్శించవు. దాని చుట్టూ ఏ గాలీ నాట్యం చేయదు. అక్కడ మేఘాలతో ఎట్లాంటి సంభాషణ వుండదు. సూర్య, చంద్ర, నక్షత్రాల పరామర్శా వుండదు. విత్తనం అస్తిత్వంతో ఎట్లాంటి వినిమయాన్ని కలిగి వుండదు. అది ముడుచుకుని వుంటుంది. విచ్చుకోదు. ధ్యానం దాన్ని విచ్చుకునేలా చేస్తుంది. ధ్యానం దాన్ని అన్ని దిక్కూలకూ వికసించేలా చేస్తుంది. అస్తిత్వ సౌందర్యం వేపు దాన్ని అల్లుకునేలా చేస్తుంది. గాలి గానానికి, మేఘాల స్వేచ్ఛకు, నీ చుట్టూ వున్న రహస్యాలకు దాన్ని అభిముఖం చేస్తుంది. అంతర్భహిస్సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


21 Apr 2022

No comments:

Post a Comment